తీవ్రమైన కడుపునొప్పి.. తిరగబడిన మూత్రనాళం 

30 Jun, 2021 10:09 IST|Sakshi

ల్యాప్రోస్కోపిక్‌తో అరుదైన చికిత్స 

కర్నూలు(హాస్పిటల్‌): అరుదైన మూత్రనాళ సమస్యతో బాధపడుతున్న మహిళకు కర్నూలులోని కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు ల్యాప్రోస్కోపిక్‌తో  శస్త్రచికిత్స చేసి ఉపశమనం కలిగించారు.  వివరాలను మంగళవారం  హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  యురాలజిస్టు డాక్టర్‌ మనోజ్‌కుమార్‌ వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘నంద్యాలకు  చెందిన నాగమణి (47) నెలరోజులకు పైగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఇటీవల ఆసుపత్రికి వచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె కుడి కిడ్నీకి వాపు రావడంతో పాటు కిడ్నీ సంబంధిత రెట్రోకావల్‌ యురేటర్‌ (తిరగబడిన మూత్రనాళం) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాం.

వారం రోజుల క్రితం ఆమెకు ల్యాప్రోస్కోపిక్‌ కీహోల్‌ సర్జరీ చేశాం. ప్రస్తుతం ఆమె కోలుకుంది. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి పుట్టుకతో సంభవించే అరుదైన వ్యాధి ఇది. ఈ ఆపరేషన్‌ను ఎక్కువగా ఓపెన్‌ సర్జరీ పద్ధతిలోనే చేస్తాం. అయితే అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉండటంతో ల్యాప్రోస్కోపిక్‌ ద్వారాసులభంగా చేయగలిగాం’ అని వివరించారు.
చదవండి: ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట మృతదేహాలు లభ్యం

మరిన్ని వార్తలు