-

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన వైద్యులు

27 Nov, 2022 04:11 IST|Sakshi

2015లో రాష్ట్రంలో పీహెచ్‌సీల్లో ఖాళీగా 858 వైద్య పోస్టులు  

అప్పట్లో 1,412 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితి 

2021 నాటికి అందుబాటులోకి 2001 మంది వైద్యులు 

రాష్ట్రంలో 2018లో 29గా ఉన్న శిశు మరణాల రేటు 

2020 నాటికి 24కు తగ్గుదల ఆర్బీఐ హ్యాండ్‌ బుక్‌ నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం అందాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల అందుబాటు పెరిగింది. శిశు మరణాల రేటు తగ్గింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  విడుదల చేసిన ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌ 2021–22’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. 2015లో అప్పటి ప్రభుత్వం 2,270 వైద్య పోస్టులను మంజూరు చేస్తున్నట్లు ఘనంగా ప్రకటించింది. వాస్తవానికి పీహెచ్‌సీల్లో 1,412 మంది వైద్యులు మాత్రమే ఉండేవారు. మిగిలిన 858 పోస్టులు ఖాళీగానే ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పీహెచ్‌సీల్లో రెండు వైద్య పోస్టులను తప్పనిసరి చేసింది.

ఇందుకు అనుగుణంగా చర్యలు కూడా చేపట్టింది. దీంతో 2015తో పోలిస్తే 2021 నాటికి పీహెచ్‌సీల్లో వైద్యుల సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీలకు 2146 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2021లో ఆర్బీఐ లెక్కలు చేపట్టే నాటికి 2,001 మంది వైద్యులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నారు. 145 పోస్టులు ఖాళీగా ఉండేవి. ఈ ఖాళీ పోస్టులతో పాటు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా అదనపు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. 

తగ్గిన శిశు మరణాలు 
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో శిశు మరణాల రేటు కూడా తగ్గింది. 2018లో సగటున వెయ్యి ప్రసవాలకు 29 శిశు మరణాలు ఉండేవి. ఈ రేటు 2019లో 25కు, 2020లో 24కు పడిపోయింది. జాతీయ స్థాయికన్నా మన రాష్ట్రంలో శిశు మరణాల రేటు తక్కువగా ఉంటోంది. 2020లో జాతీయ శిశు మరణాల రేటు 28గా నమోదైంది. 

9 ఏళ్లు పెరిగిన ఆయుర్దాయం 
వైద్య సౌకర్యాలు ప్రజలకు ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరగడం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలోనూ ఆయుర్దాయం పెరిగింది. 1991–95 మధ్య రాష్ట్రంలో మనిషి ఆయుర్దాయం 61.8 సంవత్సరాలు, దేశంలో 60.3 సంవత్సరాలుగా ఉండేది.

2015–19 నాటికి దేశంలో 69.7 సంవత్సరాలకు, రాష్ట్రంలో 70.3 సంవత్సరాలకు పెరిగింది. పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా నమోదైంది. 2015–19 మధ్య రాష్ట్రంలో పురుషుల ఆయుర్దాయం 68.9 సంవత్సరాలు, మహిళల్లో 71.8 ఏళ్లుగా నమోదైంది.   

మరిన్ని వార్తలు