గుండెను గాబరా పెట్టొద్దు

29 Sep, 2022 05:32 IST|Sakshi

చిన్న వయసు నుంచే జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటున్న వైద్యులు

సాక్షి, అమరావతి: గుండె జబ్బుతో చనిపోయారు.. పూర్వం ఈ మాట చాలా పెద్ద వయస్సు వారి గురించే వినపడేది. 40 ఏళ్ల లోపు వయస్సు వారిలో చాలా అరుదు. మరి ఇప్పుడు..?? వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారినీ గుండె జబ్బు వేధిస్తోంది. కాలానుగుణంగా వచ్చిన వాతావరణ మార్పులు, ఆహార అలవాట్లు, దురలవాట్లు, మానసిక ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల చిన్నా పెద్దా అందరినీ గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. ఇటీవలి కాలంలో 25 ఏళ్ల వయస్సు నిండని వారు కూడా గుండె పోటుతో మరణించడం తరచూ వింటున్నాం. ఈ క్రమంలో చిన్న వయస్సు నుంచే జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

రాష్ట్రంలో పరిస్థితి ఇలా 
‘రిపోర్ట్‌ ఆన్‌ మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్స్‌’ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో రాష్ట్రంలో 4.55 లక్షల మరణాలు నమోదవగా వీటిలో 22.3 శాతం.. అంటే 1,01,353 మంది వివిధ అనారోగ్య సమస్యలు, జబ్బులతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీటిలో గుండె జబ్బులతో మరణించిన వారు సుమారు 60 వేల మంది ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ మరణాల్లో హార్ట్‌ అటాక్, కార్డియాక్‌ అరెస్ట్, కరొనరీ ఆర్టరీ, కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి) మరణాలే అధికంగా ఉన్నాయి. మృతుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఇదే ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 18,11,688 మరణాలు వివిధ జబ్బులు, అనారోగ్య కారణాల వల్ల సంభవించినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఇందులో 32 శాతం మరణాలకు గుండె జబ్బులే కారణం. 2020 జూలై 1వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్స్‌లను 23 లక్షల మంది వినియోగించుకున్నారు. 108 అంబులెన్స్‌లు అటెండ్‌ అవుతున్న ఎమర్జెన్సీ కేసుల్లో నాలుగు శాతం మేర గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలతో కూడిన కేసులు ఉంటున్నాయి. 

ఈ జీవన విధానంతోనే గుండె సురక్షితం 
► నలభై దాటిన వారు, రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ (బీపీ, సుగర్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు) ఉన్న వారు తరచూ జనరల్‌ చెకప్‌ చేయించుకోవాలి 
► రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్‌ లేదా స్విమ్మింగ్‌ చేయాలి. రోజువారీ శారీరక శ్రమను అలవరుచుకోవాలి. 
► ఆకు కూరలు, చిరు ధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. తినే ఆహారంలో తీపి, ఉప్పు, నూనె పదార్థాలు తగ్గించాలి 
► రెడ్‌ మీట్‌ (బీఫ్, పోర్క్, మటన్‌) తగ్గించాలి. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి 
► ధూమపానం, మద్యపానం మానేయాలి 
► శరీరం బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. 
► కొలెస్ట్రాల్‌ నియంత్రణలో పెట్టుకోవాలి 
► మానసిక ఒత్తిడి తగ్గించే యోగా, ధ్యానం చేయాలి.

రూ.377.97 కోట్లు ఖర్చు
ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా ఏటా లక్షలాది మందికి కార్పొరేట్‌ వైద్య సేవలు ఉచితంగా అందిస్తోంది. ఇందులో గుండెజబ్బులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో 2021–22లో 45,034 మంది, 2022–23లో ఇప్పటి వరకు 28,822 మంది.. మొత్తంగా 73,856 మంది వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె జబ్బులకు చికిత్స పొందారు. ఇందులో 8 వేల మందికి పైగా బాధితులకు బైపాస్‌ సర్జరీ జరిగింది. గుండె జబ్బుల చికిత్సల కోసం ప్రభుత్వం రూ.377.97 కోట్లు ఖర్చు చేసింది. ఇది కాకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం విశ్రాంతి సమయానికి ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించింది.
– హరేంధిరప్రసాద్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో  

మరిన్ని వార్తలు