కుక్కల గుంపు.. 100 మీటర్ల దూరం లాక్కెళ్లి..

26 Jun, 2021 14:48 IST|Sakshi
కుక్కల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రదీప్‌

ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి 

కోవెలకుంట్ల: మండలంలోని అమడాల గ్రామంలో ఐదేళ్ల బాలుడిపై శుక్రవారం కుక్కల గుంపు దాడి చేసింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన తిమ్మయ్య, నాగజ్యోతి దంపతులకు ప్రదీప్, పౌర్ణమి, ప్రత్యూష సంతానం. ముగ్గురు పిల్లలు ఇంటి పక్కనే ఉన్న కల్లంలో ఆడుకుంటుండగా దాదాపు ఇరవై కుక్కలు ఒక్కసారిగా చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు తప్పించుకోగా ప్రదీప్‌ను వెంబడించాయి. కింద పడటంతో బాలుడిని 100 మీటర్ల మేర లాక్కెళ్లి వీపు భాగంలో విచక్షణా రహితంగా కరిచాయి.

మిగతా పిల్లలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తండ్రి తిమ్మయ్య హుటాహుటిన అక్కడకు చేరుకుని కుక్కల బారి నుంచి కుమారుడిని రక్షించాడు. చికిత్స నిమిత్తం వెంటనే కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పందించి ఎంపీడీఓ మహబూబ్‌దౌలా, ఈఓపీఆర్‌డీ ప్రకాష్‌నాయుడు తదితర అధికారులను ఆసుపత్రికి పంపించి బాలుడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. గ్రామంలో కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

చదవండి: హడలెత్తించిన నాగుపాము.. నాగరాజుకు ఫోన్‌..    
ప్రేమ వ్యవహారం: రాయబారానికి పిలిచి హతమార్చారు!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు