నీటిని రాజకీయాలకు వాడుకోవద్దు: సీఎం జగన్‌

8 Jul, 2021 15:30 IST|Sakshi

రాయదుర్గం: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంతోనూ విబేధాలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని, అన్ని రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలుపెట్టలేదని ఈ సందర్భంగా సీఎం జగన్‌ గుర్తుచేశారు. తెలంగాణలో కొంతమంది మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అని.. ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిపియని సీఎం తెలిపారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవని ఆయన చెప్పారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లకు 800 అడుగులలోపే నీళ్లు తీసుకుంటున్నారని సీఎం జగన్‌ అన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగుల్లోపు తెలంగాణ వాడుకున్నప్పుడు ఏపీ వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

అయ్యా చంద్రబాబు ఆనాడు ఏం చేశావ్‌?
అయ్యా చంద్రబాబు ఇవాళ మాటలు మాట్లాడుతున్నావు. అయ్యా? గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాడు తెలంగాణలో ప్రాజెక్ట్‌లు కడుతుంటే  చంద్రబాబు గాడిదలు కాశారా ’ అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి, దిండి.. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీకూడా కడుతూ ఉంటే మీరు గాడిదలు కాస్తున్నారా? అని చంద్రబాబుని సీఎం జగన్‌ నిలదీశారు. రైతులు ఏ ప్రాంతంలో ఉన్నా రైతులేనని, రైతుల కోసం అందరూ కలిసి రావాలని సీఎం అన్నారు. నీటిని రాజకీయాలకు వాడుకోవద్దని సీఎం జగన్‌ సూచించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు