సవాంగ్‌ స్ఫూర్తితోనే అవార్డు

9 Nov, 2020 05:07 IST|Sakshi

ఐరాస ఉత్తమ మహిళా పోలీస్‌ అవార్డు గ్రహీత డోరిన్‌ మెలాంబో

2008లో యూఎన్‌లో సవాంగ్‌తో కలసి పనిచేసిన మెలాంబో 

సాక్షి, అమరావతి: ఐపీఎస్‌ అధికారి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తనకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని యునైటెడ్‌ నేషన్స్‌(యూఎన్‌) ఉత్తమ మహిళా పోలీస్‌ అవార్డుకు ఎన్నికైన డోరిన్‌ మెలాంబో ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల గొప్పతనాన్ని చాటుతోంది. జాంబియాకు చెందిన మెలాంబో తనకు ఐరాస ప్రతిష్టాత్మక అవార్డు లభించిన సందర్భంగా అంతర్జాతీయ మీడియా చానల్‌ ‘స్టార్ట్‌ న్యూస్‌ గ్లోబల్‌’ ప్రతినిధి అమితాబ్‌ పి.రవికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మెలాంబో ప్రత్యేకంగా సవాంగ్‌కు కృతజ్ఞతలు తెలపడం విశేషం. మెలాంబో వీడియో క్లిప్‌ పోలీసుల వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారింది.  

స్ఫూర్తి నింపిన సవాంగ్‌కు కృతజ్ఞతలు.. 
‘ఈ ఏడాది యూఎన్‌ ఉత్తమ మహిళా పోలీస్‌ అధికారిగా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. నేను యూఎన్‌ బెస్ట్‌ పోలీస్‌ అధికారిగా ఎన్నిక కావటానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయుడు భారత్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. 2008లో యూఎన్‌ పోలీస్‌ విభాగంలో ప్రయాణాన్ని ప్రారంభించా. అప్పటి నుంచి సవాంగ్‌ నాకు దిశానిర్దేశం చేసి సమర్థవంతమైన అధికారిణిగా నిలిచేలా దోహదం చేశారు. ఈ వీడియోను ఆయన వీక్షిస్తారని ఆశిస్తున్నా’ అని మెలాంబో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  గౌతమ్‌ సవాంగ్‌ 2008లో యూఎన్‌ మిషన్‌ ఇన్‌ లైబీరియాకు పోలీస్‌ కమిషనర్‌గా వ్యవహరించారు. 40 దేశాలకు చెందిన పోలీస్‌ అధికారులకు సారథ్యం వహించారు. 

>
మరిన్ని వార్తలు