భూ..చోళ్ల ‘డబుల్‌’ దందా! ఎన్‌ఆర్‌ఐల భూములే టార్గెట్‌

25 Dec, 2021 23:05 IST|Sakshi
సరోజ పేరిట సృష్టించిన నకిలీ డాక్యుమెంట్‌, మధురిమ పేరిట ఉన్న ఒరిజినల్‌ డాక్యుమెంట్‌

వెలుగులోకి వస్తున్న డబుల్‌ రిజిస్ట్రేషన్‌ అక్రమాలు 

పేరూరులోని గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో దగాపడ్డ ఫ్లాట్ల యజమానులు

మొత్తం వ్యవహారంలో ఓ ఖాకీ హస్తం

చిత్తూరు జిల్లా కలకడ మండలం కోపూరివాండ్ల పల్లెకు చెందిన ఈమె పేరు ఎ.సరోజ. కూలి పనులు చేసుకుని జీవిస్తోంది. విదేశాల్లో స్థిరపడ్డ ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి చెందిన భూమికి ఈమె హక్కుదారు అని నమ్మించి.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఓ ముఠా హైదరాబాద్‌కి చెందిన ఓ విద్యావంతురాలైన మహిళనే మోసం చేసింది. తీరా మోసం బయటపడిన తర్వాత నిలదీస్తే.. అబ్బే ఎక్కడో పొరపాటు జరిగిందని, ఆ డబ్బుతో ఈ సారి డబుల్‌బెడ్‌రూం ఫ్లాట్‌ ఇప్పిస్తామని చెప్పుకొచ్చింది. ఇరుక్కున్న డబ్బులకు ఏదో ఒకటి వస్తుందిలే అనుకుంటే.. ఈ దఫా అమెరికాలో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌ స్థల యజమాని వచ్చి.. ఆ ఫ్లాట్‌ ఎలా అమ్ముతారని కేసు వేశారు. ఇదీ భూ..చోళ్ల నయా మోసం.

స్మార్ట్‌ సిటీ తిరుపతి చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జారాయుళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. విదేశాల్లో ఉంటున్న ఎన్నారైల భూములు ఎంచుకుని డబుల్‌ రిజిస్ట్రేషన్‌లు చేస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. రూ.కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ ఒరిజినల్స్‌ కు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ పత్రాలతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. తీరా కొనుగోలు చేసినవాళ్లకు అసలు యజమానుల నుంచి లీగల్‌ నోటీసులు వస్తుండటంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ల్యాండ్‌ మాఫియాలో ఓ కానిస్టేబుల్‌ కీలకపాత్ర పోషించడంతో ఎస్పీ ప్రత్యేకంగా విచారణకు ఆదేశించారు. తిరుపతి సమీపంలో చెలరేగిపోతున్న డబుల్‌ రిజిస్ట్రేషన్‌ ముఠా అక్రమాల ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి రూరల్‌ మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీని 1964 లో ఏర్పాటు చేశారు. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలోని ఈ లే అవుట్‌కు 1969లో అప్రూవల్‌ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన ప్లాట్ల వారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఉద్యోగ విరమణ తర్వాత విదేశాల్లో స్థిరపడిన గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఎక్కువమందే ఉన్నారు. ల్యాండ్‌ మాఫియాకి ఇదే అదనుగా మారింది. ముందుగా వారి స్థలాలనే కబ్జాకు ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే సర్వే నెంబర్‌ 557లోని ప్లాట్‌ నెంబర్‌ 225లో 104 అంకణాల భూమిపై కన్ను వేశారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగశేఖరరెడ్డి, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లుగా చెప్పుకునే శ్రీరాములు నాయుడు, బాలకృష్ణలు ఓ ముఠాగా ఏర్పడ్డారు.

ఆ 104 అంకణాల భూ యజమాని ఎన్నారై కుటుంబానికి చెందిన సరోజ అని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి బి.పద్మజకు రూ.60లక్షలకు విక్రయించారు. చాలా తక్కువ ధరకే మీకు అమ్మించామంటూ ఎక్కువ కమీషనే తీసుకున్నారు. కొనుగోలు చేసిన పద్మజ ఆ భూమిలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తుండగా.. ఎన్‌ఆర్‌ఐ మధురిమ అనే మహిళ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ స్థలం మాదేనని, మీరు మోసపోయారని చెప్పింది.

బిత్తరపోయిన పద్మజ.. విషయాన్ని సదరు ముఠాకి చెప్పి నిలదీయగా.. ఇలా కొంతమంది ఫేక్‌ వ్యక్తులు ఫోన్‌ చేస్తుంటారని మీరేమీ పట్టించుకోవద్దని బుకాయించారు. అయితే మధురిమ తన వద్దనున్న ఒరిజినల్‌ డాక్యుమెంట్లతో పోలీసులను ఆశ్రయించడంతో ముఠా మోసం బట్టబయలైంది. కానీ అప్పటికే ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించుకుంటున్న పద్మజ.. మరో రూ.60లక్షలను అసలు భూమి యజమాని మధురిమకు ఇచ్చి కొనుగోలు చేసి మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 

మళ్లీ మళ్లీ మోసం 
తాను మోసపోయానని, తాను ఇచ్చిన రూ.60లక్షలను తిరిగి ఇచ్చేయాలని పద్మజ సదరు ముఠాని డిమాండ్‌ చేసింది. అయితే ఇక్కడే ఆ మాఫియా మరో మోసానికి తెర లేపింది. డబ్బులివ్వలేమని, అదే సొసైటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ ఇప్పిస్తామని నమ్మబలికింది. దక్కిందే దక్కనీ అనుకున్న పద్మజ అందుకు అంగీకరించారు. దీంతో గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో సర్వే నెంబర్‌ 585 ప్లాట్‌ నెంబర్‌ 47లో నూతనంగా నిర్మాణం చేసిన హిల్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో డబుల్‌ బెడ్‌రూం 502 ఫ్లాట్‌ను రూ.30లక్షలకు కేటాయించారు.

ఎంతోకొంత వచ్చిందని పద్మజ ఆనంద పడే టైంలోనే మళ్లీ మోసపోయామన్న సంగతి వెలుగుచూసింది. అసలు ఆ అపార్ట్‌మెంట్‌ ఉన్న స్థలం నాదంటూ ఎన్‌ఆర్‌ఐ నిరంజన్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. తన స్థలంలో ఫేక్‌ డాక్యుమెంట్లతో అపార్ట్‌మెంట్‌ నిర్మించేసి ఫ్లాట్లు విక్రయించారంటూ ఆ మాఫియాతో పాటు కొనుగోలు చేసిన వారందరికీ నిరంజన్‌రెడ్డి లీగల్‌ నోటీసులు పంపించారు. దీంతో మళ్లీ మోసపోయామని గ్రహించి పద్మజ సదరు కానిస్టేబుల్‌ సహా ముఠా సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్‌పి వెంకట అప్పలనాయుడుని కలిసి ఈ నయా దందాను వివరించారు.

నాలా చాలామంది మోసపోయారు 
అక్కడ భూములు కొన్న వాళ్లు చాలామంది మోసపోయారు.. ఆ కానిస్టేబుల్‌ అండ్‌ కో చేసే దందాలకు అంతులేదు. పోలీసులు లోతుగా విచారిస్తే చాలా అక్రమాలు 
బయటపడతాయి. – ఫిర్యాదుదారు పద్మజ 

నేను ఏ పాపం ఎరుగను.. 
నిజంగా నాకు ఏ పాపం తెలియదు. అప్పుడప్పుడు మా ఊరికి వచ్చే రామకృష్ణ అనే వ్యక్తి తిరుపతిలో నాకొక స్థలం ఉంది.. సొంత ప్లాట్‌ ఉంది.. నేను అమ్ముకుంటున్నాను.. నువ్వు సాక్షి సంతకం పెడితే నీకు ఎంతో కొంత ఇస్తానని నమ్మించారు. కానీ పది రూపాయలు కూడా ఇవ్వలేదు.. పైగా ఇప్పుడు అదంతా మోసం అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నిద్ర కూడా పట్టడం లేదు. ఏౖమైనా కేసులు పెడితే నా పరువేం కానూ.. మట్టి పనులు చేసుకునే నేను.. భూముల మాయ ఎలా చేయగలను  – కలకడ మండలం కోపూరివాండ్ల పల్లెకు చెందిన ఎ.సరోజ 

గతంలోనే హెచ్చరించినా.. 
కానిస్టేబుల్‌ ముఠాని నేను గతంలోనే హెచ్చరించాను. 1964లో ఏర్పాటైన సొసైటీ మాది. అప్పట్లో కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు తొంభై ఏళ్ళ వయస్సుకి వచ్చేశారు. కొందరు చనిపోయారు. మరికొందరు విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ ముఠానే కాదు.. భూమల పేరిట మాయ చేసే బ్యాచ్‌లు తిరుగుతూ మోసం చేస్తున్నారు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ మోసాలకు సంబంధించి ఇప్పటికి ఐదు కేసులు నా వద్దకు వచ్చాయి. అప్రమత్తంగా ఉండటమే పరిష్కారం – ప్రభాకర్, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ హౌసింగ్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ 

ఖాకీ పాత్రపై విచారణ 
కానిస్టేబుల్‌ నాగశేఖరరెడ్డి పాత్ర ఉందంటూ ఫిర్యాదు వచ్చిన మాట నిజమే. నేను పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాను. అక్కడ చాలా మోసాలు జరిగాయని అంటున్నారు. మొత్తంగా విచారణ చేయాలని చెప్పాను. కానిస్టేబుల్‌ది తప్పని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. 
– వెంకట అప్పల నాయుడు, అర్బన్‌ ఎస్పీ

మరిన్ని వార్తలు