సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ విధుల్లోకి..

27 Nov, 2022 05:19 IST|Sakshi
డాక్టర్‌ నర్తు భాస్కరరావు

కరోనాతో ఊపిరితిత్తులు దెబ్బతిని సీఎం సాయంతో చికిత్స పొందిన ప్రభుత్వ వైద్యుడు

పూర్తిగా కోలుకుని సీఎంను కలిసిన వెంటనే బదిలీ ఉత్తర్వులు

కారంచేడు పీహెచ్‌సీ నుంచి గుంటూరు జిల్లాకు బదిలీ అయిన భాస్కరరావు 

కారంచేడు: కరోనా బాధితులకు వైద్యం చేస్తూ తానూ ఆ వ్యాధి బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ నర్తు భాస్కరరావు సీఎం జగన్‌ సాయంతో చికిత్స చేయించుకుని ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరారు. గుంటూరు జిల్లా నల్లపాడు రీజినల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఆర్‌టీసీ)కి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ పబ్లిక్‌ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.రామిరెడ్డి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఆయన కోవిడ్‌–19 సమయంలో కారంచేడు పీహెచ్‌సీ నుంచి సుమారు 10 వేల కోవిడ్‌ టెస్ట్‌లు చేసి.. అదే కరోనా కోరలకు చిక్కి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి తప్పనిసరని, అందుకు సుమారు రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుందని హైదరాబాద్‌ కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు చెప్పారు. దీంతో ఆయన భార్య డాక్టర్‌ భాగ్యలక్ష్మి విజ్ఞప్తి మేరకు ఐఎంఏ వైద్యులు, ఐఆర్‌ఐఏ వైద్యులు, కార్డియాలజీ, అనస్థీషియా అసోసియేషన్, గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ ఓల్డు స్టూడెంట్స్, కారంచేడుకు చెందిన ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు, అనేక మంది దాతల సహకారంతో సుమారు రూ.50 లక్షలు సిద్ధం చేశారు.

డాక్టర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి మేరకు అప్పటి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ల సహకారంతో సీఎంను కలిసి వైద్యానికి అయ్చే ఖర్చు విషయమై విజ్ఞప్తి చేయగా.. వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. భాస్కరరావు వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో వెంటనే ఆయనకు ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.1.50 కోట్లతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

అప్పటి నుంచి ఆయన వైద్యుల సూచనతో ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నెల 21న తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపి, తాను మళ్లీ విధుల్లో చేరతానని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే ఆయనకు ఉత్తర్వులు వెలువడ్డాయి.   

మరిన్ని వార్తలు