సాధారణ డిగ్రీతో పాటు ఉపాధి కోర్సులు

12 Sep, 2022 04:55 IST|Sakshi
మాట్లాడుతున్న ఎల్‌.విజయకృష్ణారెడ్డి

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభం

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు, ఉపాధి కల్పించే కోర్సులను అనుసంధానం చేసినట్టు యూనివర్సీటీ సహాయ సేవా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌.విజయకృష్ణారెడ్డి అన్నారు. విశాఖ వచ్చిన ఆయన ఆదివారం మద్దిలపాలెం డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా కళాశాలలో గల ఓపెన్‌ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.

సాధారణ డిగ్రీ కోర్సులకు అదనంగా, ఉపాధి కల్పించే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను జోడించినట్టు తెలిపారు. దీని ద్వారా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పైచదువులతో పాటు, ఉపాధి పొందేలా రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై విధిగా సాధారణ డిగ్రీ కోర్సులతో పాటు ఉపాధి కోర్సును ఓ పాఠ్యాంశంలా చదవాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా 2022–23 విద్యా సంవత్సరానికి సంబం«ధించిన అడ్మిషన్‌లు ప్రారంభమయ్యాయని, ఫీజులను కూడా ఇకపై ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలన్నారు.

స్టడీ మెటీరియల్‌ను స్పీడ్‌ పోస్టు ద్వారా విద్యార్థుల చిరునామాలకు పంపుతామని చెప్పారు. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ల కోసం డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.బీఆర్‌ఓయూఆన్‌లైన్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఇంటర్‌.. దానికి సమాన విద్యార్హతగల వారు డిగ్రీలో జాయిన్‌ కావచ్చునన్నారు.

పాత విద్యార్థులకు రీ అడ్మిషన్‌ అవకాశం కల్పించినట్టు తెలిపారు. 1999 తర్వాత అడ్మిషన్‌ తీసుకున్న డిగ్రీ విద్యార్థులకు, 2005 తర్వాత అడ్మిషన్‌ తీసుకున్న పీజీ విద్యార్థులకు ఆయా కోర్సులు పూర్తి చేసుకోవడానికి రీ అడ్మిషన్‌ ఇస్తున్నట్టు విజయకృష్ణారెడ్డి వివరించారు. 

మరిన్ని వార్తలు