కరోనా కేసులు పెరిగితే ఆందోళన అక్కర్లేదు

2 Aug, 2020 05:36 IST|Sakshi

ఢిల్లీ ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి డా.కె.శ్రీనాథరెడ్డి

టెస్టులు పెద్ద సంఖ్యలో చేయకపోతే అసలుకే ప్రమాదం

ఎంతమందిని గుర్తిస్తే అంతగా కట్టడి చేయొచ్చు

వీలైనంతమందిని కరోనా నుంచి కాపాడగలగాలి

సాక్షి, అమరావతి: ‘దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువవుతోంది. ఇది ఒక స్థాయి వరకు పెరిగి ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంది. కేసులు ఎక్కువగా పెరిగినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు పది వేల పాజిటివ్‌ కేసులను గుర్తించామంటే.. వారి నుంచి మరో పది వేల మందికి వైరస్‌ వ్యాపించకుండా కాపాడినట్టు లెక్క. ఎక్కువ మందిని గుర్తించి వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేయడమే ఈ వైరస్‌కు అసలు సిసలు మందు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు’ అని అంటున్నారు.. పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు, ఎయిమ్స్‌ ఢిల్లీ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ గౌరవ సలహాదారు డా.కె.శ్రీనాథరెడ్డి. శనివారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

మరణాలను నియంత్రించాలి..
మరణాలను నియంత్రించగలిగితే చాలు. వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇదే పెద్ద వ్యూహం. రాష్ట్రంలో రోజూ 70 వేల టెస్టులు చేస్తున్నారు. ఇందులో పది వేలు పాజిటివ్‌గా తేలుతున్నాయి. ఇలా ఎక్కువ మందిని గుర్తించడం వల్ల వారి నుంచి అంతకంటే ఎక్కువ మందికి వైరస్‌ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌  మార్గదర్శకాల ప్రకారం.. వైరస్‌ వ్యాప్తి ఎక్కువ ఉన్న చోట అధికంగా టెస్టులు చేయాలి. దీని ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ఎక్కువ టెస్టులు చేయడం.. గొప్ప వ్యూహం. కేసులు పెరుగుతున్నాయని టెస్టులు చేయకపోవడం అసలుకే ప్రమాదం. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి టీకా వస్తుంది.

మరిన్ని వార్తలు