కరోనాకు కాక్‌ టెయిల్‌ యాంటీబాడీ ఇంజక్షన్‌తో చెక్‌

30 May, 2021 04:49 IST|Sakshi

ఇంజక్షన్‌ ఇచ్చిన 24 గంటల్లో వ్యాధి తగ్గుముఖం 

కోవిడ్‌కు ఆస్పత్రిలో అడ్మిట్‌ అవ్వాల్సిన పనిలేదు 

ఏపీలో తొలిసారిగా గుంటూరులో రోగులకు ఇంజక్షన్లు 

ఒక్కో ఇంజక్షన్‌ రూ.60 వేలు 

డాక్టర్‌ కళ్యాణ్‌చక్రవర్తి వెల్లడి 

గుంటూరు మెడికల్‌: కోవిడ్‌–19 సోకి రోజుల తరబడి ఆస్పత్రుల్లో చికిత్స పొందకుండా కేవలం ఒకే ఒక్క ఇంజక్షన్‌ ద్వారా ఒక్కరోజులోనే కోవిడ్‌ నుంచి కోలుకోవచ్చని సమిష్ట హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (శ్రీ) మేనేజింగ్‌ డైరెక్టర్, ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ కోగంటి కళ్యాణ్‌ చక్రవర్తి చెప్పారు. ఆస్పత్రుల్లో అడ్మిట్‌ అవకుండా డే కేర్‌ ట్రీట్‌మెంట్‌ సర్వీసెస్‌ ద్వారా ఇంటి వద్దే ఉండి కరోనా నుంచి కోలుకోవచ్చన్నారు. గుంటూరులోని శ్రీ హాస్పిటల్‌లో శనివారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏపీలో మొట్టమొదటిసారిగా తమ ఆస్పత్రిలో కరోనా సోకిన రోగికి అంతర్జాతీయంగా ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన రీజెనర్‌ ఆన్‌ కాక్‌టెయిల్‌ యాంటీబాడీ ఇంజక్షన్‌ చేశామన్నారు.

గుంటూరుకు చెందిన 56 ఏళ్ల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు జ్వరం సోకి అది తగ్గకపోగా పెరిగిపోతూ సీఆర్పీ ఒక్కరోజులోనే నాలుగు రెట్లు పెరిగిందన్నారు. కోవిడ్‌ చికిత్స కోసం తమ వద్దకు రాగా శుక్రవారం ఆయనకు కాక్‌టెయిల్‌ యాంటీబాడీ ఇంజక్షన్‌ చేశామన్నారు. ఇతర మందులు ఏమీ ఇవ్వలేదని, 164 ఉన్న సీఆర్పీ ఒక్కసారిగా 75కు వచ్చిందన్నారు. శరీరంలో వైరస్‌ శాతం పెరిగితే సీఆర్పీ పెరుగుతుందని, ఒక్క ఇంజక్షన్‌తోనే సీఆర్పీ తగ్గుముఖం పట్టిందనే విషయం తమ ఆస్పత్రిలో రోగికి చేసిన ఇంజక్షన్‌ ద్వారా నిరూపితమైందన్నారు. కోవిడ్‌ వైరస్‌ను నిలువరించేవి శరీరంలోని యాంటీ బాడీలేనని, సాధారణంగా కోవిడ్‌ సోకిన వారికి యాంటీ బాడీలు శరీరంలో తయారవటానికి 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ లోగా కోవిడ్‌ తీవ్రమయ్యే ప్రమాదముందని, ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందన్నారు.

మూడు నుంచి ఐదు రోజుల్లోగా ఇంజక్షన్‌ 
వ్యాధి పెరగకుండా, ఆస్పత్రిలో చేరాల్సిన పనిలేకుండా కోవిడ్‌ సోకిన మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలోగా కాక్‌టెయిల్‌ ఇంజక్షన్‌  ఇవ్వటం ద్వారా కరోనా నుంచి త్వరగా కోలుకుంటారని డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి చెప్పారు. ఒక్క రోగికి ఇంజక్షన్‌కు రూ.60 వేలు ఖర్చు అవుతుందని, కరోనాపై పోరాటం చేసేందుకు ఈ ఇంజక్షన్‌ రోగికి బలాన్ని ఇస్తుందన్నారు. ఇంజక్షన్‌ చేయించుకున్నవారిలో 75 శాతం మంది ఆస్పత్రుల్లో చేరకుండా ఇళ్లలోనే ఉండి వ్యాధిని జయించవచ్చని తెలిపారు. స్టెమ్‌ సెల్‌ థెరపీ కూడా కోవిడ్‌ సోకిన రోగుల్లో మంచి ఫలితాలను ఇస్తుందని, శ్రీ హాస్పిటల్‌లో 12 మందికి స్టెమ్‌సెల్‌ థెరపీ ద్వారా చికిత్స అందించి వ్యాధి నుంచి కోలుకునేలా చేశామన్నారు. సమావేశంలో శ్రీ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యార్లగడ్డ రవితేజ, డాక్టర్‌ నారాయణరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు