భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ దంపతులకు విశిష్ట పురస్కారం

7 Nov, 2021 05:51 IST|Sakshi
పురస్కారాలను ప్రకటిస్తున్న రామినేని ఫౌండేషన్‌ చైర్మన్‌ ధర్మప్రచారక్, కన్వీనర్‌ నాగభూషణం

డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రకటన

సినీ హాస్య నటుడు బ్రహ్మానందానికి విశేష పురస్కారం

వివరాలు వెల్లడించిన ఫౌండేషన్‌ చైర్మన్‌ ధర్మప్రచారక్‌

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి పురస్కారాలు అందిస్తున్నట్టు డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ చైర్మన్‌ రామినేని ధర్మప్రచారక్‌ చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపక చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణ ఎం.ఎల్ల, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎం.ఎల్లకు విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు.

అలాగే తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం, నిమ్స్‌ ఆస్పత్రి ఎనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ దుర్గాపద్మజ, తెలుగు సినిమా జర్నలిస్ట్‌ ఎస్‌వీ రామారావుకు విశేష పురస్కారాలు అందిస్తున్నట్టు వివరించారు. ఫౌండేషన్‌ కన్వీనర్‌ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గతేడాది ఫౌండేషన్‌ తరఫున పురస్కారాలను ప్రకటించినా.. కరోనా కారణంగా వాటిని అందజేయలేదన్నారు.

ఈ ఏడాది నిర్వహించే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో వాటినీ అందిస్తామని చెప్పారు. నాబార్డ్‌ చైర్మన్‌ డాక్టర్‌ జీఆర్‌ చింతలకు విశిష్ట పురస్కారం, సినీ నటుడు సోనూసూద్‌కు ప్రత్యేక పురస్కారం, టీవీ యాంకర్‌ సుమకనకాల, హీలింగ్‌ హాస్థ హెర్బల్స్‌ప్రైవేట్‌ æలిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.మస్తాన్‌యాదవ్, షిర్డీలోని ద్వారకామయి సేవా ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ బి.శ్రీనివాస్‌కు విశేష పురస్కారాలను గతేడాది ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పురస్కారాలను అందించే తేదీ, వేదిక తదితర వివరాలను త్వరలో తెలియజేస్తామని నాగభూషణం చెప్పారు.  
 

మరిన్ని వార్తలు