ఆయుర్వేదంలో విస్తృత పరిశోధనలు జరగాలి

21 Jul, 2021 04:17 IST|Sakshi
ఆయుర్వేద కళాశాలలో డిస్‌ప్లేను తిలకిస్తున్న వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

డాక్టర్లు రోగులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి 

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ 

తిరుపతి తుడా :  ఆయుర్వేద వైద్యంలో విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. ఇందుకు యూనివర్సిటీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం ఆయన వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి, కళాశాలలోని వార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, రోగులు ఎంతో నమ్మకంతో చికిత్స నిమిత్తం డాక్టర్ల వద్దకు వస్తారని, వారితో ఆప్యాయంగా మాట్లాడితే సగం రోగం నయం చేసినట్లేనన్నారు. డాక్టర్లు కేవలం సంపాదన కోసమే కాకుండా పేదలకు మేలు చేసేలా కూడా ఆలోచించాలన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా డాక్టర్లు నైపుణ్యం పెంచుకోవాలని వీసీ సూచించారు. పుస్తకాలు చదవడం కంటే రోగిని డీల్‌ చేయడమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద వైద్యంలో పరిశోధనలకు మంచి అవకాశాలున్నాయని, ప్రొఫెసర్లు ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. వైద్య రంగంలో మరింత పురోగతి సాధించడానికి ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్‌ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే భావనను విద్యార్థులు తొలగించుకోవాలని హితవు చెప్పారు. 

థర్డ్‌ వేవ్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి  
కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌పై నిపుణుల హెచ్చరికలపట్ల అప్రమత్తంగా వుంటూ ప్రజల్ని చైతన్యపరచాలని డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ కోరారు. కోవిడ్‌–19 అనేక రకాలుగా రూపాంతరం చెందుతోందని.. ఆయుర్వేద వైద్యంలో కూడా దీని కట్టడికి పరిశోధనలు చేయాలన్నారు. ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుందరం, ఆర్‌ఎంవో డాక్టర్‌ జి.పద్మావతి, పీజీ రీడర్‌ డాక్టర్‌ రేణుదీక్షిత్‌తో పాటు వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు