మనగ్రామం.. జల్‌జీవన్‌ మార్గదర్శి

30 Mar, 2021 05:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పశ్చిమగోదావరి జిల్లా మారుమూల గ్రామం కాకిన్నూర్ 

ఇక్కడ 200 కుటుంబాలకు సురక్షిత మంచినీరు

దేశంలో ఏడు కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చాం

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ

సాక్షి, న్యూఢిల్లీ: జలజీవన్‌ మిషన్‌ విజయానికి పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని కాకిన్నూర్‌ గ్రామం ఒక నిదర్శనమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘కాకిన్నూర్‌.. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య ఉంది. ఈ గ్రామానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. విద్యుత్‌ సరఫరా లేదు. గ్రామానికి వెళ్లడం చాలా కష్టమైన పని. అయితే.. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీరు అందించాలన్న లక్ష్యంతో అధికారులు విజయం సాధించారు. గోదావరి నదీ తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ గ్రామానికి చేరుకోవడానికి మార్గం లేకపోవడంతో అధికారులు పడవలో డ్రిల్లింగ్‌ యంత్రాలను రవాణా చేశారు.

తీరానికి సమీపంలో ఒక వాగు దగ్గరలో గొట్టపు బావిని తవ్వారు. దానికి సౌరశక్తితో పనిచేసే పంపును అమర్చి గ్రామంలో మొత్తం 200 కుటుంబాలకు కుళాయిల ద్వారా సురక్షిత తాగునీటిని అందించగలిగారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యం కాకిన్నూర్‌ గ్రామంలో పూర్తిగా నెరవేరింది. కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీటిని తాగడంతో ప్రజల ఆరోగ్య స్థితిగతులు పూర్తిగా మెరుగుపడ్డాయి’ అని మంత్రిత్వ శాఖ ప్రశంసలు కురిపించింది. దేశంలో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లోని ఏడు కోట్ల గృహాలకు జల్‌జీవన్‌ మిషన్‌ కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపింది. 

2024 నాటికి అన్ని గృహాలకు సురక్షిత మంచినీరు
దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్‌ మిషన్‌ను ప్రారంభించామని జల్‌శక్తి శాఖ తెలిపింది. ఆగస్టు 2019 నాటికి మూడు కోట్ల కుళాయి కనెక్షన్లు ఉండగా.. తాజాగా ఈ పథకం కింద రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 4,00,37,853 కనెక్షన్లు అందించామంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ల సంఖ్య 7,24,00,691కి చేరిందని వివరించింది. తెలంగాణ, గోవా, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వంద శాతం కుళాయి కనెక్షన్లు అందించామని తెలిపింది.  

>
మరిన్ని వార్తలు