టెన్షన్‌.. టెన్షన్‌; నది మధ్యలో.. నాలుగు గంటలు

15 Aug, 2021 04:29 IST|Sakshi

పులిచింతల గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద

నదిలో చిక్కుకుపోయిన 123 మంది టిప్పర్ల డ్రైవర్లు, సిబ్బంది 

నాటు పడవలతో కాపాడినఅధికారులు.. వాహనాలన్నీ నదిలోనే

ఏపీలోని కృష్ణా జిల్లా చెవిటికల్లులో ఘటన 

నందిగామ: అదో ఇసుక రీచ్‌.. శుక్రవారం అర్ధరాత్రి.. ఇసుక తవ్వే జేసీబీలు.. నింపుకొనే టిప్పర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. నిరంతరాయంగా ఇసుక తవ్వుతూ, వాహనాల్లో నింపుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నదిలో ప్రవాహం పెరిగింది.. కాసేపటికే వాహనాలను ముంచెత్తింది. పెద్ద సంఖ్యలో టిప్పర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు, సిబ్బంది నదిలో చిక్కుకుపోయి.. బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

బయటికెళ్లే మార్గం తెగిపోయి..
చెవిటికల్లు ఇసుక రీచ్‌ నుంచి రోజూ వందల వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు ఇసుక లోడ్‌ చేసుకునేందుకు రీచ్‌కు వెళ్లాయి. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి అర్ధరాత్రి సమయంలో నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నదిలో ఒక్కసారిగా వరద పెరిగింది. ఆ సమయంలో నదిలో 132 టిప్పర్లు/లారీలు, నాలుగు ట్రాక్టర్లు, కొన్ని జేసీబీలు ఉన్నాయి.

నది ప్రవాహాన్ని గుర్తించిన కొందరు డ్రైవర్లు, సిబ్బంది వెంటనే బయటికి వెళ్లగలిగారు. ఇంతలోనే నదిలోకి వేసిన తాత్కాలిక మార్గం కొట్టుకుపోయింది. దాంతో 123 మంది నదిలోనే చిక్కుకుపోయారు. వాహనాలన్నీ ఆగిపోయాయి. దీనిపై సమాచారం అందిన పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం 6.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి నాటు పడవల సాయంతో 123 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాహనాలన్నీ నదిలోనే ఉండిపోయాయి. తెగిపోయిన మార్గాన్ని పునరుద్ధరించి వాటిని బయటికి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు