పార్టీ ఆఫీసులో ద్రోణంరాజు సంతాప సభ

4 Oct, 2020 19:21 IST|Sakshi

సాక్షి,  విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతి పట్ల పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అభిమానులు విచారం వ్యక్తం చేశారు. విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వారంతా సంతాప సభ నిర్వహించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, అమర్నాథ్‌ నివాళులర్పించారు.

ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మృతి పట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ద్రోణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ద్రోణంరాజు శ్రీనివాస్‌ పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ వన్‌టౌన్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 

రేపు ఉదయం ద్రోణంరాజు అంత్యక్రియలు
ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయానికి రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పినాకిల్ ఆసుపత్రి నుంచి పెద వాల్తేరులోని ద్రోణంరాజు  స్వగృహానికి భౌతిక కాయాన్ని తరలించారు. ఉదయం 9 గంటల నుంచి ద్రోణంరాజు భౌతిక కాయాన్ని అభిమానులు, కార్యకర్తలు అభిమానులు సందర్శనార్థం ఉంచుతామని ద్రోణంరాజు శ్రీనివాస్ బంధువులు తెలిపారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తామనేది రేపు ఉదయం వెల్లడిస్తామని చెప్పారు.
(చదవండి: మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత)

మరిన్ని వార్తలు