ద్రోణంరాజు మరణం తీరనిలోటు

6 Oct, 2020 04:59 IST|Sakshi
ద్రోణంరాజు సంతాప సభలో మాట్లాడుతున్న సజ్జల, చిత్రంలో ఎమ్మెల్యేలు తదితరులు

ప్రభుత్వ సలహాదారు సజ్జల తదితరుల నివాళి 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ

సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మరణం వైఎస్సార్‌ సీపీకి, విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీరని నష్టం మిగిల్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ద్రోణంరాజు అనగానే సత్యనారాయణ గుర్తుకు వస్తారన్నారు. విశాఖపట్నంలో ఆదివారం మరణించిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ సంతాపసభను సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. శ్రీనివాస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనా ప్రజల మధ్య ఉంటూ వచ్చారన్నారు. ఆయన మరణానికి పార్టీ తీవ్ర సంతాపం తెలుపుతోందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీనివాస్‌ అందరికీ తలలో నాలుకలా ఉండేవారన్నారు. సజ్జలతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ద్రోణంరాజు శ్రీనివాస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్లా మధు, మాజీ మంత్రి నర్సీగౌడ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఇ.రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌.పద్మజ, ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.  

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు 
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, వీఎంఆర్‌డీఏ మాజీ  చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. జగదాంబ జంక్షన్‌ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం అనంతరం నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ప్రభుత్వ విప్‌ బి.ముత్యాలనాయుడు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు.  

>
మరిన్ని వార్తలు