Dry Eyes Blindness: అసలే వేసవి, ఆపై కంప్యూటర్‌ కాలం.. కళ్లు ‘కళ’ తప్పితే.. చిన్న వయసులోనే!

23 May, 2022 17:31 IST|Sakshi

సాక్షి, పార్వతీపురం: కళ్లు నిత్యం తడిగా ఉంటాయి.. కంటినిండా నీరు ఉంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే నేత్రాలు నిండు జలాశయాలు వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యం కారణంగా కంటిలో తడి ఆరిపోతోంది. నేత్ర వ్యాధులు అధికమవుతున్నాయి. చివరకు చూపు మసకబారుతోంది. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను చాలా విలువైనది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు కలకాలం చల్లాగా ఉండాలి. చూపు శాశ్వతమవ్వాలి.

కానీ మనిషి దుష్ప్రవర్తన కారణంగా కంటి సమస్యలు ఏర్పడి పిన్న వయస్సులోనే అంధత్వం ఏర్పడుతోంది. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు ఎండిపోకుండా చేస్తాయి. వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడి ఆరిపోయి దురదలు ప్రారంభమవుతున్నాయి. వేసవి ప్రయాణాల్లో కంటి రెప్పలు నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కొట్టుకుంటున్నాయని వైద్యులు ఒక సర్వేలో పేర్కొన్నారు. ఫలితంగా కంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని వెల్లడించారు.   
చదవండి👉🏼 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే!

అధిక వినియోగం ముప్పు..   
ప్రస్తుతం సాంకేతికత రాజ్యమేలుతోంది. అన్ని చోట్లా కంప్యూటర్‌ వినియోగం పెరిగింది. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ప్రజలు మొబైల్‌ వినియోగిస్తున్నారు. నిత్యం కంప్యూటర్‌తో వర్క్‌ చేయడం, మొబైల్‌ ఆపరేటింగ్‌లో తలమునకలవ్వడం కారణంగా కళ్లు పొడిబారి పోతున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 మందిలో 60 నుంచి 70 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 99 శాతం మంది కార్నియ సమస్యలకు గురవుతున్నారు. వేడిగాలుల బారిన పడడం, ఆండ్రాయిడ్, కంప్యూటర్‌ వినియోగించడం, రాత్రి 12 గంటల వరకు సెల్‌ఫోన్‌తో గడపడం కారణంగా ఈ సమస్య వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 15 నుంచి 40 ఏళ్ల మద్య ఉన్నవారే అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. 
చదవండి👉🏻 నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి!

సాధారణ కన్ను

పొడిబారిన కన్ను

తీసుకోవాల్సిన జాగ్రత్తలు   
వేసవిలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లజోడు ధరించాలి.  
ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగం తగ్గించుకోవాలి. 
కంప్యూటర్ల వద్ద గంటలకొద్దీ గడపరాదు.  
కంటి రెప్పలు ఎక్కువసార్లు కొట్టుకొనే విధంగా ప్రయత్నించాలి.  
తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. 
కంటికి దురదలు వచ్చే సమయంలో చేతితో నలపరాదు 
కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.  
చదవండి👉🏾 చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స

అవగాహన తప్పనిసరి 
రోజురోజుకూ కంటి సమస్యలు అధిగమవుతున్నాయి. 70 శాతం మంది కంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇవి చిన్నవైనప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బయట ప్రయాణాలు వద్డు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ను చిన్నారులకు ఇవ్వరాదు. టీవీ, సెల్‌ఫోన్, కంప్యూటర్‌ వాడే సమయంలో అరగంట కొకసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వాలి. ఏవైనా కంటి సమస్యలు వస్తే నేరుగా వైద్యులను సంప్రదించాలి.   
 – డాక్టర్‌ జీరు నగేష్‌రెడ్డి, వైఎస్సార్‌ కంటి వెలుగు జిల్లా ఇన్‌చార్జ్, పార్వతీపురం మన్యం  

మరిన్ని వార్తలు