వైద్య వృత్తిని వదిలి డీఎస్పీగా.. 

26 Nov, 2020 12:30 IST|Sakshi

ఆల్‌రౌండర్‌గా సీఎం పిస్టల్‌ పురస్కారం

అథ్లెటిక్స్‌లోనూ పతకాల పరంపర  

జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్‌ విజయ ప్రస్థానం 

సాక్షి, జంగారెడ్డిగూడెం: ఆయన ఒక డాక్టర్‌.. గిరిజనుల సమస్యలకు చలించిపోయారు.. వైద్యవృత్తిని నిర్వహిస్తూనే వారి సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.. ఈ సమయంలో గిరిజనులు చూపించిన ఆప్యాయతతో వైద్య వృత్తి నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ వైపు మరిలారు.. పాలనా విభాగంలో ఉంటే మరిన్ని సమస్యలు పరిష్కరించవచ్చనే తలంపుతో గ్రూప్‌–1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. తన ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు.
 
వైద్యుడిగా పేర్గాంచి.. 
జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బి.రవికిరణ్‌ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన డీఎస్పీగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్‌గా జంగారెడ్డిగూడెం వచ్చారు. వృత్తిరీత్యా ఈయన డాక్టర్‌. 2002–2008లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి 2010లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రిలో విధుల్లో చేరారు. అక్కడ 2014 వరకు విధులు నిర్వహించి, తర్వాత అదే జిల్లా అక్కులపేట పీహెచ్‌కీ బదిలీ అయ్యారు. వైద్యాధికారిగా పీహెచ్‌సీని ఆధునీకరించారు. కార్పొరేట్‌ ఆస్పత్రి స్థాయిలో పీహెచ్‌సీని మార్పు చేసి వైద్య సేవలు అందించారు. 2016, 2017లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఆస్పత్రి, ఉత్త వైద్యులుగా రవికిరణ్‌ పురస్కారాలు అందుకున్నారు. 2017, 2018లో విశాఖలో పనిచేశారు.
 
బీజం పడిందిలా.. 
రవికిరణ్‌ అక్కులపేట పీహెచ్‌సీలో పనిచేస్తుండగా గిరిజనుల సమస్యలు గుర్తించారు. అల్లిపల్లిగూడెం గిరిజనులు, గిరిజనే తరులు మధ్య భూవివాదాలు గుర్తించి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. అప్పుడే ఆయనకు అడ్మినిస్ట్రేటర్‌ కావాలనే ఆలోచన వచ్చింది. 2016లో గ్రూప్‌–1కు రాయగా 2017 ఫలితాలు వచ్చాయి. రవికిరణ్‌ 12వ ర్యాంకు సాధించారు. దీంతో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్‌గా జంగారెడ్డిగూడెం వచ్చారు.

శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యం 
సబ్‌ డివిజన్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయం అని డీఎస్పీ రవికిరణ్‌ అన్నారు. తాను చేపట్టాల్సిన పనులపై విజన్‌ ఉందని, ప్రధానంగా సైబర్, ఆర్థిక నేరాలు, బాలలు, స్త్రీల వేధింపుల కేసులపై దృష్టి, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో సబ్‌డివిజన్‌లో శాంతిభద్రత పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామన్నారు. యువతను సామాజిక సేవ, క్రీడలు, సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పిస్తామన్నారు.  

సీఎం పిస్టల్‌ అందుకుంటూ..
డీఎస్పీగా ఎంపికైన రవికిరణ్‌ 2018లో అనంతపురంలో శిక్షణ పొందారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సీఎం పిస్టల్‌ అవార్డును అందుకున్నారు. శిక్షణలో ఆల్‌రౌండర్‌గా నిలిచి హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా పురస్కారం పొందారు.  

అథ్లెటిక్స్‌లో రాణించి.. 
శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన రవికిరణ్‌ తండ్రి రాధాకృష్ణ, తల్లి విజయకుమారి. ఆయన భార్య విశాఖలోని మెప్మా జిల్లా మిషన్‌ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. రవికిరణ్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రవికిరణ్‌ ఎంబీబీఎస్‌ చేస్తున్న సమయంలో అథ్లెటిక్స్‌లో రాణించారు. లాంగ్‌ జంప్, హైజంప్, పరుగు పోటీల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో 73 వరకు పతకాలు సాధించారు. మొత్తంగా 126 వరకు ఆయన పతకాలు పొందారు.   

మరిన్ని వార్తలు