కుట్రలు 'జేసీ'.. డీఎస్పీని టార్గెట్‌ చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి 

27 Sep, 2022 07:11 IST|Sakshi

పోలీసులపై పెత్తనం చేసేందుకు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపారు. ముఖ్యంగా డీఎస్పీ వీఎన్‌కే చైతన్యను టార్గెట్‌ చేశారు. నజరానాలకు లొంగకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా నక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలని తీవ్రంగా  ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్‌ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుచరులతో ప్రైవేటు కేసులు పెట్టిస్తున్నారు. డీఎస్పీ లక్ష్యంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి సాగిస్తున్న కుయుక్తులను నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు.  

సాక్షి, తాడిపత్రి:  అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా పోలీసులను గుప్పిట్లో పెట్టుకునేందుకు జేసీ సోదరులు ప్రయత్నిస్తున్నారు. చెప్పినట్టు నడుచుకునే వారుంటే తమ రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కవచ్చనేది వారి ఆలోచన. ఇందు కోసం శాంతిభద్రతలకు సైతం విఘాతం కలిగిస్తున్నారు. తాజాగా డీఎస్పీ   వీఎన్‌కే చైతన్యను తమ వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెర లేపారు.

సోషల్‌ మీడియా వేదికగా ప్రభాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు, దూషణలను చూస్తే డీఎస్పీని బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జేసీ సోదరులు తమ మాట వినని పోలీసు అధికారులను దారిలోకి తెచ్చుకునేందుకు అనుచరులతో ప్రైవేటు కేసులు వేయించారు. ప్రబోధాశ్రమ ఘటనలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కు తాళం వేసి.. పోలీసులు చేతకాని వాళ్లంటూ అప్పటి డీఎస్పీ విజయ్‌కుమార్‌పై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. 2010–11లో జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్‌ పొట్టి రవికి అప్పటి ఎస్పీ ఎంకే సిన్హా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన జేసీ సోదరులు పొట్టి రవితో ఎస్పీపై ప్రైవేటు కేసు వేయించారు. అదే పంథానే ఇప్పుడూ జేసీ సోదరులు కొనసాగిస్తున్నారు.

తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో 2018 సెప్టెంబర్‌ 15న వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి మాజీ ఎంపీ జేసీపై పోలీసులు మొదట్లో కేసు నమోదు చేయలేదు. కానీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ అధికారి ఆంథోనప్ప అప్పటి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి, నిందితుల వాంగ్మూలం మేరకు మాజీ ఎంపీపైనా కేసు నమోదు చేసి, చార్జ్‌షీట్‌లో పేరు పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి తన అన్నను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో ప్రస్తుత డీఎస్పీ చైతన్యపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా జఠాధర ఇండస్ట్రీస్‌కు సంబంధించిన వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంపై దర్యాప్తు కోసం డీఎస్పీ చైతన్య ఈ ఏడాది జూలైలో నాగాలాండ్‌ వెళ్లారు.

అక్కడ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించారు. ఈ కేసులో చార్జ్‌షీట్‌ వేయడంతో పాటు ఈడీ విచారణకు సహకరిస్తే తన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి జైలుకు వెళతారన్న భయంతో డీఎస్పీపై తన అనుచరులతో ప్రైవేట్‌ కేసులు వేయిస్తూ బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోలీసులు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించారని, పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించారని డీఎస్పీని ప్రశంసించిన ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు ఆయనపైనే ప్రైవేటు కేసులు పెట్టిస్తుండడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. 

జేసీ ప్రభాకర్‌ ఆగడాలకు నిదర్శనాలివిగో... 
ట 2020 డిసెంబర్‌ 12న టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జేసీ అస్మిత్‌రెడ్డి ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఎక్కడ తన కుమారుడిని అరెస్టు చేస్తారోనన్న భయంతో ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా పోలీసులను తన దారికి తెచ్చుకోవాలని బ్లాక్‌మెయిల్, కుట్రలకు దిగినట్లు తెలుస్తోంది. 
►తాడిపత్రి పట్టణంలోకి పోలీసులు అనుమతించలేదని జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు పొట్టి రవితో గత ఏడాది జూన్‌ 22న డీఎస్పీపై హైకోర్టులో ప్రైవేటు కేసు వేయించారు. 
►ఈ ఏడాది జూన్‌ 11న గన్నెవారిపల్లి కాలనీలోని ఎస్టీపీ వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు సంబంధించి డీఎస్పీ చైతన్య తనను స్టేషన్‌కు పిలిపించి కొట్టి, కులం పేరుతో దూషించాడని తాడిపత్రి పట్టణంలోని 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ మల్లికార్జునతో ఈ నెల 23న కోర్టులో ప్రైవేట్‌ కేసు వేయించారు. ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. డీఎస్పీపై ఆరోపణలు చేయడం గమనార్హం. 
►ఇటీవల యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో యానిమేటర్‌ పోస్టు విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై జఠాధర ఇండస్ట్రీస్‌ యజమాని చవ్వా గోపాల్‌రెడ్డి అనుచరులు గొజ్జుల రాజు, గొజ్జుల సింహాద్రి, మరికెల రాజు తదితరులు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను స్టేషన్‌కు పిలిపించి నోటీసులు జారీ చేసి ఇంటికి పంపించారు. అయితే దీన్ని ప్రభాకర్‌రెడ్డి వక్రీకరించారు. సదరు నిందితులను తన ఇంటికి పిలిపించుకుని మీడియా ఎదుట తప్పుడు ఆరోపణలు చేయించారు. విచారణ పేరుతో పోలీసులు తమను కొట్టారంటూ వారితో చెప్పించారు. అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న వారితో స్థానిక కోర్టులో ప్రైవేటు కేసు వేయించారు.  నాగాలాండ్‌లో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌   వ్యవహారంలో చార్జ్‌షీట్‌ వేయకుండా పక్కదారి పట్టించేందుకు ఇలా చేసినట్లు విమర్శలు ఉన్నాయి. 
►ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా పెన్నా నది సమీపాన పార్కులో వినాయక మండపం ఏర్పాటుకు అనుమతివ్వాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరగా.. మున్సిపల్‌ స్థలంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని డీఎస్పీ నిరాకరించారు. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా ప్రభాకర్‌రెడ్డి డీఎస్పీపై నోరుపారేసుకున్నారు. 
►శింగనమల నియోజకవర్గం పుట్లూరులో కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ వర్గీయులకు చెందిన వ్యవసాయ పొలంలోకి వెళ్లి మద్యం తాగారు. అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గీయులపై పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపైనా కేసులు నమోదు చేయాలంటూ ఎ.కొండాపురానికి చెందిన చంద్ర దండు నాయకుడు ప్రకాష్‌నాయుడు ఈ నెల 23న పుట్లూరు ఎస్‌ఐకి వ్యతిరేకంగా పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ వ్యవహారాన్ని కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి తనకు అనుకూలంగా మలచుకుని ప్రకాష్‌నాయుడును పోలీసులపై ఉసిగొల్పినట్లు తెలిసింది. 

మాట వినలేదని వైరం 
మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పోలీసుల తీరును, ప్రత్యేకంగా డీఎస్పీ వీఎన్‌కే చైతన్య కృషిని ప్రశంసించే నెపంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి రాయబారం నెరిపారు. తన ప్రధాన అనుచరునితో బంగారు బిస్కెట్లను నజరానాగా పంపగా.. డీఎస్పీ సున్నితంగా తిరస్కరించడమే కాక తనదైన శైలిలో ‘వార్నింగ్‌’ ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల అనంతరం తనకు ఫేవర్‌ చేయాలని మాంసాహార వంటకాల క్యారేజీలతో నెరిపిన     రాయబారమూ ఫలించలేదు. రాయబేరాలు, పైరవీల కోసం మరోసారి తన కార్యాలయానికి వస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించడాన్ని ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి వైరం మొదలైంది. చైతన్య ఇక్కడ ఉంటే తమ ఆటలు సాగవని.. ఎలాగైనా పంపించేయాలని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. 

డీఎస్పీకి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టాలని ఒత్తిడి  
‘మా నాన్న నారాయణ 2021 ఆగస్టు రెండో తేదీన ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే నాన్న మృతికి కుళ్లాయప్ప, నారాయణ, నాగరాజులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మూడో తేదీ పెద్దపప్పూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుండగానే.. సోమవారం ఓ వ్యక్తి నాకు ఫోన్‌ చేశాడు. ‘మీ నాన్న విషయంలో నీకు న్యాయం జరగలేదు..  డీఎస్పీకి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టాల’ని ఒత్తిడి తెచ్చి బెదిరించాడు. ఇదే విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకొచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను’.           
 – నాగేంద్ర, సోమనపల్లి, పెద్దపప్పూరు మండలం 

కౌన్సిలర్‌ మల్లికార్జున ఫోన్‌ నుంచి కాల్‌  
పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన నాగేంద్ర తనకు వచ్చిన ఫోన్‌ కాల్‌ బెదిరింపుపై డీఎస్పీ చైతన్యకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు నాగేంద్రకు వచ్చిన ఫోన్‌ కాల్‌ను ట్రేస్‌అవుట్‌ చేయగా అది జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడైన తాడిపత్రి 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ మల్లికార్జునకు చెందిన ఫోన్‌ నంబర్‌గా తేలింది. ఇటీవల కౌన్సిలర్‌ మల్లికార్జున.. డీఎస్పీపై ప్రైవేటు కేసు వేశారు. సంబంధం లేని వారిని బెదిరించి ప్రెస్‌మీట్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్న కౌన్సిలర్‌ మల్లికార్జునపై కేసు నమోదు చేశాం.    – ఖాజాహుసేన్, ఎస్‌ఐ

తప్పుడు కేసులకు భయపడం 
బెదిరింపులు, కోర్టుల్లో తప్పుడు కేసులకు పోలీసులు భయపడరు. జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించినా, పొగడ్తలతో ముంచెత్తినా చట్ట ప్రకారమే మేం విధులు నిర్వర్తిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే సంయమనంతో ఉన్నాం. ప్రజల ప్రశాంత జీవనానికి ఎవరు భంగం కల్గించినా కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పుడు కేసులకు భయపడితే పోలీసులు ఉద్యోగం చేయలేరు.  
– వీఎన్‌కే చైతన్య, డీఎస్పీ 

మరిన్ని వార్తలు