ఇంద్రకీలాద్రి: టికెట్‌ ఉంటేనే దర్శనం! 

13 Oct, 2020 12:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో టికెట్లు కలిగి ఉన్న వారినే కనకదుర్గమ్మ వారి దర్శనానికి అనుమతించనున్నట్టు కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ వెల్లడించారు. ఆన్‌లైన్‌లో రూ.300లు, 100ల టికెట్లతో పాటు ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో దుర్గ గుడి చైర్మన్‌ పైలా స్వామినాయుడు, ఈవో ఎం.సురేష్‌బాబులతో కలిసి కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు.  

  • కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. 
  • క్యూలైన్లలో భక్తులకు శానిటైజర్లు సమకూరుస్తామన్నారు.  
  • సాధారణ రోజుల్లో రోజూ 10 వేల టికెట్లు, మూలా నక్షత్రం రోజున 13 వేల టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. గంటకు వెయ్యి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.  
  • పదేళ్ల లోపు, 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపైకి అనుమతించడం లేదని స్పష్టం చేశారు.  
  • కోవిడ్‌ దృష్ట్యా ఇతర జిల్లాల పోలీసులను బందోబస్తుకు రప్పించడం లేదని తెలిపారు.  

ఆన్‌లైన్‌లో లక్ష టికెట్లు.. 

  • అమ్మవారి దర్శనానికి లక్ష టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని దేవస్థానం చైర్మన్‌ పైలా స్వామినాయుడు తెలిపారు. భక్తులు ఇప్పటికే సుమారు 67 వేల టికెట్లు తీసుకున్నారని తెలిపారు.  
  • కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జిల్లాల భవానీ దీక్ష గురువులతో మాట్లాడామన్నారు. దేవాలయంలో భవానీ దీక్షల మాలధారణ, విరమణలకు అనుమతించడం లేదని, వీటిని వారి గ్రామాల్లోనే చేపట్టాలని సూచించినట్టు తెలిపారు.  
  • అమ్మవారి తెప్పోత్సవం యథావిధిగా నిర్వహిస్తామని, కానీ భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. వీఐపీలకు ప్రత్యేక సమయాలు కేటాయిస్తామన్నారు.  

ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకే దర్శనాలు 

  • ఉత్సవాల మొదటి రోజు అక్టోబర్‌ 17న ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు, ఆ తర్వాత రోజుల్లో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఈవో సురేష్‌బాబు తెలిపారు.  
  • మూలా నక్షత్రం (21న) రోజున అమ్మవారి దర్శనం ఉదయం 3 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందన్నారు.  
  • వినాయక గుడి నుంచి భక్తులను అనుమతిస్తామని.. భక్తులు మాస్క్‌లు ధరించాలని, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలని, తమ వెంట మంచినీరు తెచ్చుకోవాలని సూచించారు.  
  • ఆలయ బస్సులు, లిఫ్టు సౌకర్యాన్ని, ఘాట్‌రోడ్డు దారిని నిలిపి వేస్తున్నామన్నారు.  
  • ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, వస్త్రాలను పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. 
  • మీడియా పరిమిత సంఖ్యలో రెండు షిఫ్టుల్లో కవరేజీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 
మరిన్ని వార్తలు