సేంద్రియ విధానం... కొత్త పురుగు.. పరుగో పరుగు

10 Jan, 2022 04:39 IST|Sakshi
కొత్త పురుగు సోకిన మిరప పంటకు కషాయం పిచికారీ చేస్తున్న రైతు

సేంద్రియ పద్ధతులతో ఇండోనేషియా పురుగుకు చెక్‌ పెడుతున్న దుర్గాడ రైతులు

పెను విపత్తుకు ప్రకృతి వైద్యం చేస్తున్న సాధారణ రైతులు

తక్కువ ఖర్చుతో సేంద్రియ మందుల తయారీ

పరిశీలించాల్సి ఉందంటున్న ఉద్యాన అధికారులు

పిఠాపురం: ‘త్రిప్స్‌ పార్విస్పైనస్‌’.. ఇండోనేషియా నుంచి వచ్చిన కొత్త రకం తామర పురుగు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో విధ్వంసం సృష్టిస్తోంది. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిరప, మామిడి, చింత, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికమ్, బంతి, చామంతి వంటి ఉద్యాన పంటలను చిదిమేస్తోంది. ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేపట్టాయి. కాగా, ఈ కొత్త పురుగును తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతులు సేంద్రియ విధానాలతో కట్టడి చేస్తున్నారు. గ్రామంలో 650 ఎకరాల్లో మిరప సాగు చేయగా.. సేంద్రియ పద్ధతులు పాటించిన 80 ఎకరాల్లో మిరప చేను కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. దీంతో మిగిలిన రైతులు కూడా సేంద్రియ మందుల వాడకం ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. 

కుళ్లిన ఉల్లితో కషాయం
దుర్గాడ గ్రామంలో కొంత విస్తీర్ణంలో ఉల్లి కూడా పండిస్తుంటారు. ఉల్లి కుళ్లి పోతే పనికి రాదని పారేసేవారు. ఇప్పుడు ఆ కుళ్లిన ఉల్లి మరో పంటకు ప్రాణం పోస్తోంది. కుళ్లిన ఉల్లితో రైతులు కషాయం తయారు చేస్తున్నారు. 70 కేజీల ఉల్లి, 20 కేజీల వేపాకు, 20 కేజీల సీతాఫలం ఆకు, 70 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం, 5 కేజీల ఉమ్మెత్త ఆకు, 4 లీటర్ల నీరు కలిపి 4 గంటలు ఉడకబెట్టి జీవామృతం తయారు చేస్తున్నారు. దీనినుంచి సుమారు 100 నుంచి 110 లీటర్ల జీవామృతం తయారవుతుండగా.. ఎకరానికి 6 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటితో కలిపి మిరప పంటపై పిచికారీ చేస్తుంటే కొత్త పురుగుతోపాటు ఇతర పురుగులు సైతం చనిపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. దీనిని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాలపాటు పంటకు పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కొత్త తామర పురుగు పూర్తిగా పోతోందని, దెబ్బతిన్న పంట కూడా తిరిగి ఊపిరి పోసుకుంటోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. నాలుగో వారంలో పులియబెట్టిన మజ్జిగ పిచికారీ చేస్తున్నామని, దీనివల్ల పంటకు చల్లదనం వస్తుందని చెబుతున్నారు. దేశవాళీ ఆవు పాలతో తయారైన మజ్జిగ మాత్రమే ఇందుకు ఉపయోగపడుతుందంటున్నారు. కాగా, ఉల్లి కషాయాన్ని పొరుగు రైతులకు లీటరు రూ.30 చొప్పున అమ్ముతున్నారు. 

కుళ్లిన చేపలతో మీనామృతం
మరోవైపు ఇతర చీడపీడల నుంచి రక్షించుకునేందుకు మీనామృతాన్ని ఇక్కడి రైతులు వినియోగిస్తున్నారు. పిండినల్లి, పూత రాలడం వంటి సమస్యకు కుళ్లిన చేపలతో మీనామృతం తయారు చేస్తున్నారు. 70 కేజీల కుళ్లిన చేపలు, 70 కేజీల పాత బెల్లం, 70 లీటర్ల నీరు కలిపి 21 రోజులు ఊరబెడుతున్నారు. ఊరిన తరువాత 10 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మీనామృతం చొప్పున కలిపి పిచికారీ చేస్తున్నారు. మీనామృతంను లీటరు రూ.100కు విక్రయిస్తున్నారు.

అల్లం, వెల్లుల్లితో అగ్ని అస్త్రం
మరోవైపు రసం తొలిచే పురుగు, గొంగళి పురుగు, కాయ తొలిచే పురుగుల నుంచి కాపాడుకునేందుకు అల్లం, వెల్లుల్లి కషాయాన్ని వినియోగిస్తున్నారు.  కేజీ అల్లం, 500 గ్రాముల వెల్లుల్లి, కేజీ పొగాకు, 2 కేజీల వేపాకులను 48 గంటలపాటు నీటిలో నానబెట్టి దానిని మిర్చి పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్టు ఇక్కడి రైతులు చెబుతున్నారు.

పరిశీలిస్తున్నాం
కొత్త పురుగు ఉధృతి ఇటీవల బాగా పెరిగింది. దీనిపై ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. సేంద్రియ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గినట్టు కనిపిస్తోంది. దుర్గాడలో రైతులు పాటిస్తున్న సేంద్రియ విధానాలపై ఉద్యాన శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి నిర్ధారిస్తే సేంద్రియ మందుల తయారీ మరింత పెరిగే అవకాశం ఉంది. 
– శైలజ, ఉద్యాన అధికారి, పిఠాపురం

కొత్త పురుగును తరిమికొడుతున్నారు
స్థానిక రైతులు సేంద్రియ పద్ధతులతో కొత్త పురుగును తరిమికొడుతున్నారు. రసాయనక ఎరువులు, మందుల కంటే ఇవి బాగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉల్లి కషాయం వాడిన పొలాల్లో మిరప పంట కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. అలా వాడిన పొలాల్లో పంట మళ్లీ పుంజుకుంటోంది.
– అనంతకుమార్, డిజిటల్‌ మాస్టర్‌ ట్రైనర్, ప్రకృతి వ్యవసాయం

పరిశీలించి నిర్ధారిస్తాం
సేంద్రియ మందుల వినియోగం వల్ల కొత్త పురుగు తగ్గుతున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిని పరిశీలించి ఎంతవరకు తగ్గుతుంది, ఎలా పని చేస్తుందనేది నిర్ధారించాల్సి ఉంది. త్వరలో తూర్పు గోదావరి జిల్లా పర్యటించి పంటలను పరిశీలించి నిర్ధారిస్తాం.
– శిరీష, ఉద్యాన శాస్త్రవేత్త, గుంటూరు

ఉల్లి కషాయం కొత్త పురుగును కట్టడి చేస్తోంది
కుళ్లిన ఉల్లి, వేపాకులతో తయారు చేస్తున్న కషాయం కొత్త పురుగును బాగా కట్టడి చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఇప్పటివరకు సుమారు 80 ఎకరాల్లో మిర్చి పంటలు కొత్త పురుగును తట్టుకుని నిలబడ్డాయి. దీంతో మిగిలిన రైతులు సేంద్రియ మందులు వాడటం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ బారీగా ఉల్లి కషాయం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాము. దీనివల్ల మా ఏరియాలో కొత్త పురుగు ఉధృతి చాలా వరకు నియంత్రించబడింది. 
– గుండ్ర శివచక్రం, రైతు, దుర్గాడ 

మరిన్ని వార్తలు