అన్నపూర్ణగా.. శ్రీమహాలక్ష్మిగా.. 

12 Oct, 2021 05:47 IST|Sakshi
అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు

రెండు విశేష అలంకారాలలో దుర్గమ్మ దర్శనం 

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం దుర్గమ్మ రెండు విశేష అలంకారాల్లో కొలువుదీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శ్రీ అన్నపూర్ణాదేవిగా, మధ్యాహ్నం 2 గంటల తరువాత శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావటంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సౌకర్యార్థం ఓంకారం వద్ద వీల్‌ చైర్స్‌ సదుపాయం, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఉచిత ప్రసాదాలు అందేలా ఏర్పాటు చేశారు. 

నేడు మూలా నక్షత్రం 
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజు మంగళవారం కనకదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా నేడు తెలవారుజామున 3 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రోజు ఎలాంటి టికెట్లు లేకుండా భక్తులందరికీ దర్శనం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. 

మరిన్ని వార్తలు