గాయత్రీ దేవిగా 'కనకదుర్గమ్మ' దర్శనం 

29 Sep, 2022 06:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన బుధవారం అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. క్యూలైన్లు సాఫీగా సాగిపోయేలా ఏర్పాట్లు చేయడంతో సామాన్యులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అవుతోంది. కొండపైకి ప్రొటోకాల్, డిజిగ్నేటెడ్‌ విఐపీల వాహనాలు తప్ప, ఇతరుల వాహనాలు రాకుండా కట్టడి చేశారు.  

కనులవిందుగా నగరోత్సవం 
ఆది దంపతుల నగరోత్సవం నయన మనోహరంగా సాగింది. గంగాసమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహా మండపం నుంచి నగరోత్సవం ప్రారంభమైంది. దుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స, కారుమూరి దర్శించుకున్నారు. కాగా, దివ్యాంగులకు మోడల్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి దుర్గగుడికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు బస్సు సౌకర్యం ఉంది.  పున్నమి ఘాట్‌ నుంచి భక్తులను ప్రత్యేక బస్సుల్లో ఓం టర్నింగ్‌ వరకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వలంటీర్లు వారిని సేకరించుకొని, వీల్‌చైర్లలో తీసుకెళ్లి దర్శనం చేయిస్తున్నారు. 

నేడు అన్నపూర్ణాదేవిగా.. 
దసరా మహోత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ చవితిని పురస్కరించుకుని గురువారం కనకదుర్గమ్మను శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నం ప్రసాదించే మాతృమూర్తి. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నాన్ని, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తు ఈశ్వరునికే భిక్షను అందించే అంశం అద్భుతం.

లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు. ఈ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతామని భక్తుల విశ్వాసం.  

మరిన్ని వార్తలు