ఇంద్రకీలాద్రిపై వైభవంగా..

27 Sep, 2022 05:26 IST|Sakshi
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులకు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న అధికారులు

ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. తొలిరోజు స్వర్ణకవచాలంకారంలో దర్శనం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున కనకదుర్గమ్మ.. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.

శాస్త్రోక్తంగా బాలభోగ నివేదన చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. తొలి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఇంద్రకీలాద్రి కోలాహలంగా మారింది. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నిర్వహించిన నగరోత్సవం భక్తులకు కనువిందుచేసింది.  

అమ్మవారి సేవలో గవర్నర్‌ దంపతులు 
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు సోమవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కల్టెకర్‌ ఢిల్లీరావు, సీపీ టీకే రాణా, ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. గవర్నర్‌ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నారు. దుర్గమ్మను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీజే తెలిపారు.  

నేడు బాలాత్రిపురసుందరిగా.. 
బెజవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ(మంగళవారం) నాడు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారమే శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి.  

మరిన్ని వార్తలు