చదువుల తల్లి సరస్వతిగా జగన్మాత

3 Oct, 2022 04:37 IST|Sakshi

భారీగా దర్శనానికి తరలివచ్చిన భక్తులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. త్రిశక్తి స్వరూపిణి నిజ స్వరూపాన్ని  సాక్షాత్కరింపజేస్తూ శ్వేత దండ, కమండలం ధరించి అభయ ముద్రలో శ్రీ సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది.

అందుకే చదువుల తల్లిగా కొలువుదీరిన దుర్గమ్మను రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం రాత్రికే క్యూలైన్లు నిండిపోయాయి. అమ్మవారి దర్శనం ఆదివారం తెల్లవారు జామున 1.10 గంటల నుంచే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు 2.30 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక కుంకుమార్చనలు, పిల్లలకు అక్షరాభ్యాసాలు జరిగాయి. అమ్మవారి నగరోత్సవం కనుల పండువగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి కళాకారులు తమ నాట్య విన్యాసాలతో అలరించారు.  

నేడు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం 
కాగా, సోమవారం దుర్గాదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన దుర్గమాసురిడిని వధించిన అమ్మవారు దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై ఆవిర్భవించారు. ‘దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. శరన్నవరాత్రులందు దుర్గాదేవిని అర్చించడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. 

అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ 
వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదివారం  దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకస్వాములు అమ్మవారికి పూజలు చేయించారు. ఆశీర్వాద మండపంలో వేద పండితులు డీజీపీకి ఆశీస్సులందించారు. 

మరిన్ని వార్తలు