11 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు

10 Oct, 2021 03:03 IST|Sakshi

నవంబర్‌ 1 నుంచి పూర్తిస్థాయి భౌతిక విచారణలు

సాక్షి,అమరావతి: ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. 20వ తేదీన హైకోర్టు పునః ప్రారంభం అవుతుంది. ఈ సెలవుల్లో దాఖలయ్యే అత్యవసర కేసులను న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ మంతోజు గంగారావు విచారించనున్నారు. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ రఘునందన్‌రావు బెంచ్‌లో, జస్టిస్‌ గంగారావు సింగిల్‌గా కేసులను విచారిస్తారు. ఈ నెల 12న ఈ ముగ్గురు న్యాయమూర్తులు తమ ముందు దాఖలయ్యే కేసులను విచారిస్తారు. కేసులను దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 11న దాఖలు చేయాల్సి ఉంటుంది.

నవంబర్‌ 1 నుంచి భౌతిక విచారణ.. 
రాష్ట్ర హైకోర్టులో నవంబర్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో భౌతిక విచారణ మొదలు కానుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న హైబ్రీడ్‌ విచారణ (భౌతిక, వీడియో కాన్ఫరెన్స్‌) విధానం ఈ నెల 31 వరకు కొనసాగనుంది. కోవిడ్‌ నేపథ్యంలో 2020 మే నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే న్యాయస్థానాల్లో కేసుల విచారణ జరుగుతూ వస్తోంది. ఇటీవల కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో హైకోర్టు ప్రయోగాత్మకంగా హైబ్రీడ్‌ విచారణ చేపట్టింది. కోవిడ్‌ కనిష్ట స్థాయికి చేరుకోవడంతో నవంబర్‌ 1 నుంచి పూర్తిస్థాయిలో భౌతిక విచారణ ద్వారా కేసులను విచారించాలని హైకోర్టు నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు