వంశపారంపర్య అర్చకులకు విధి విధానాలు

22 Aug, 2021 03:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆలయాల్లో పనిచేసే అర్చకుల కలలు నిజంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎనిమిది రకాల అంశాలకు సంబంధించి ఏ ఒక్క అంశంలో ఆధారాలు చూపినా వారిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకత్వానికి అర్హుడిగా గుర్తిస్తూ ఆలయ 43(10) రిజిస్టర్‌లో నమోదు చేయాలంటూ దేవదాయ శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌ రెండ్రోజుల క్రితం రాష్ట్రంలోని అందరు రీజనల్‌ జాయింట్‌ కమిషనర్లు, జోనల్‌ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఎనిమిది అంశాలను అ ఉత్తర్వులలో వివరించారు. అవి.. 

► అర్చక ఇనాం భూములను అనుభవిస్తూ ప్రస్తుతం అర్చకత్వం చేస్తున్న వారు సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకులుగా గుర్తించబడతారు.  
► దరఖాస్తుదారుని తండ్రి లేదా తాతలు ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తే అతడిని ఆ ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు.  
► ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అమలులో ఉన్న దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల రిజిస్టర్‌ 25లో గానీ, 1966 నాటి ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ చట్టం ప్రకారం ఆలయ రిజస్టర్‌ 38లో గానీ అర్చకులుగా నమోదై ఉన్న వారి వారసులను సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకులుగా గుర్తిస్తారు.  
► అర్చకులందరూ ఒక అవగాహనకు వచ్చి ఓ వ్యక్తిని సూచించినా అతడిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు.  
► గతంలో కోర్టు ఆదేశాలున్న చోట.. అలాంటి వారిని సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకునిగా అర్హుడవుతారు.  
► ఎలాంటి వివాదాల్లేని చోట ప్రస్తుతం ఆలయ అర్చకుడే ఆ ఆలయ వంశపారంపర్య అర్చకుని హోదా పొందవచ్చు.  
► ఏదైనా ఆలయంలో వంశపారంపర్య అర్చకునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు పేపరు నోటిఫికేషన్‌ ద్వారా అతని నియామకానికి చర్యలు చేపడతారు.  
► వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉండి ఆలయ అర్చకునిగా పనిచేసిన వారు చనిపోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబంలో నిబంధనల ప్రకారం అర్హులు లేనట్లయితే భర్తను కోల్పోయిన అర్చకుని భార్య సూచించిన వ్యక్తి ఆమె జీవితకాలం వంశపారంపర్య హోదా అర్చకునిగా పనిచేయవచ్చు.  

.. పై ఎనిమిది అంశాల ప్రాతిపదికన రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం గుర్తింపు ప్రక్రియను దేవదాయ శాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలోనే చేపడతారు. రూ. కోటిలోపు ఆదాయం ఉండే 6(ఏ) కేటగిరి ఆలయాలలో ఈ గుర్తింపు ప్రక్రియ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్ల అనుమతితో చేపడతారు. 6 (బీ) కేటగిరి ఆలయాల్లో జోనల్‌ డిప్యూటీ కమిషనర్లు, 6(సీ) కేటగిరి ఆలయాల్లో జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియకు అనుమతిస్తారు. 

ఏపీ అర్చక సమాఖ్య హర్షం 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దేవదాయ సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలు ఖరారుతో పాటు అప్పటి చట్టం అమలుకు పూనుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌తో పాటు వెలంపల్లి, వాణీమోహన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.   

అర్చక సమస్యలపై చొరవ అవసరం
పెందుర్తి:  అర్చకుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. వంశపారంపర్య హక్కులను అమలు చేయాలన్నారు. రుషికేష్‌లోని శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వాణీమోహన్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి పీఠ పూజలో పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని సూచించారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు