-

సర్పంచ్‌గా పోటీ చేస్తే చంపేస్తారా అచ్చెన్నా?

2 Feb, 2021 08:29 IST|Sakshi

టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ 

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో వారి కుటుంబ సభ్యులను కాదని ఎవరైనా సర్పంచ్‌గా పోటీచేస్తే వారిని చంపేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. జనవరి 31న కింజరాపు అప్పన్న నామినేషన్‌కు వెళితే ఆయన్ను, తనను చంపేందుకు కింజరాపు హరిప్రసాద్, సురేష్‌లతో పాటు 400 మంది మారణాయుధాలతో వెంటపడ్డారని శ్రీనివాస్‌ చెప్పారు. పోలీసులు, దేవుడి దయవల్ల బతికి బయటపడినట్టు తెలిపారు.

శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవా రం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట వేసిన నామినేషన్‌ చింపేశారని, ఆ తర్వాత మళ్లీ చివరి క్షణంలో పోలీసుల సమక్షంలో నామినేషన్‌ వేయించినట్టు చెప్పారు. ఎన్నికల నామినేషన్లలో గానీ, ఏకగ్రీవాల్లో గానీ ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ చెప్పారని, మరి అచ్చెన్న కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలన్నారు.   

ఎంతమంది ప్రాణం తీశారో చూడండి.. 
నిమ్మాడలో కింజరాపు కుటుంబాన్ని కాదని నామినేషన్‌లు వేసిన చాలామంది హత్యకు గురైనట్టు శ్రీనివాస్‌ ఆరోపించారు. కింజరాపు సూరయ్య, ఎచ్చెర్ల సూర్యనారాయణ, కింజరాపు భుజంగరావు(బుజ్జి), కొంచాడ బాలయ్యలను హత్య చేయించినట్టు చెప్పారు. రిగ్గింగ్‌ను అడ్డుకున్న కూన రామారావుని కత్తితో పొడిచి చంపారని వివరించారు. కోటబొమ్మాళితో పాటు 48 పంచాయతీల్లో ఎప్పుడూ రిగ్గింగ్‌ జరుగుతోందని, ఈ సారి దానిని అడ్డుకోవాలని అధికారులను కోరారు. అచ్చెన్నాయుడు, హరిప్రసాద్, సురేష్‌లను వెంటనే అరెస్ట్‌ చేయాలని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు