సాధికారతకు సరికొత్త మార్కు 

2 May, 2022 12:28 IST|Sakshi

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

డ్వాక్రా సంఘాలకు గ్రేడింగ్‌లు

మార్కుల ఆధారంగా గుర్తింపు

ఉమ్మడి జిల్లాలో 77,479 గ్రూపులు

రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)ను మరింత బలోపేతం చేసేందుకు వాటి పనితీరును బట్టి గ్రేడింగ్‌లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 12 అంశాల్లో 100 మార్కులు కేటాయించి, దాని ఆధారంగా గ్రేడింగ్‌ ఇస్తారు. రుణాల మంజూరులో గ్రేడ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 77,479 గ్రూపులకు గ్రేడింగ్‌ ఇస్తున్నారు.  

ఏలూరు (టూటౌన్‌):  స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం గ్రేడింగ్‌ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సంఘాల పనితీరును పరిగణనలోనికి తీసుకొనే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి గ్రేడ్‌లు కేటాయిస్తారు. మొత్తం 12 అంశాల ప్రాతిపదికగా వంద మార్కులతో ఏ,బీ,సీ,డీ గ్రేడ్‌లుగా విభజించి వాటి ఆధారంగా రుణాలు మంజూరు చేయనున్నారు. మంచి గ్రేడ్‌లు ఉంటేనే అనుకున్న రుణాలు అందుతాయి. ఈ విధానంతో పొదుపు సంఘాల సమావేశాలు నిర్వహణ, అప్పుల వసూలు, రుణాల చెల్లింపులు తదితర పనులన్నీ పారదర్శకంగా జరుగనున్నాయి. 

బ్యాంకు రుణాలతో ఊతం 
గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నారు. వీటితో పాటు అదనంగా వ్యాపారాలు చేసుకునే మహిళలకు స్త్రీ నిధి ద్వారా ప్రత్యేకంగా రుణాలు అందజేస్తున్నారు. సంఘాలను బలోపేతం చేసేలా డీఆర్‌డీఏ, వైఎస్సార్‌ క్రాంతి పథం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇకనుంచి అన్ని సంఘాలకు గ్రేడింగ్‌ విధానం అమలు చేయనున్నారు.
 
8.05 లక్షల మంది..  
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 79,624 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 8,05,458 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 22న 76,846 గ్రూపులకు గ్రేడింగ్‌లు ఇచ్చారు. మరో  2,145 గ్రూపుల సమావేశాల చిత్రాలు అప్‌లోడ్‌ చేయలేదని గుర్తించారు. ఆయా సంఘాలకు సెర్ప్, స్త్రీనిధి ద్వారా బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు.  

మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ 
డ్వాక్రా సంఘాల నిర్వహణ తీరు, సమావేశాలు చిత్రాలను ప్రత్యేక పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీంతో సంఘంలో ఏం జరుగుతుందో ప్రతి సభ్యు రాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. సంఘాల పనితీరును బట్టి గ్రేడింగ్‌ ఇస్తున్నారు. తద్వారా వెనుకంజలో ఉన్న సంఘాలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్కులు ఆధారంగా 80 శాతం దాటితే ఏ, 55 నుంచి 80 శాతం ఉంటే బీ, 55 నుంచి 30 శాతం ఉంటే సీ, 30 శాతంలోపు ఉంటే డీ గ్రేడ్‌ ఇచ్చారు.  

మార్కుల కేటాయింపు ఇలా.. 
పొదుపు సంఘాల కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణకు 5, సభ్యుల హాజరుకు 10, క్రమం తప్పని పొదుపునకు 10, పొదుపు పుస్తకాల నిర్వహణకు 7, అప్పుల వసూలుకు 8, సీఐఎఫ్‌ వసూలుకు 10, స్త్రీనిధి వసూలుకు 10, ఇతర వసూళ్లకు 5, బ్యాంకు రుణాల వాయిదాల చెల్లింపునకు 10, గ్రామ సంఘం రుణ వసూలుకు 10, సంఘం నుంచి బ్యాంకు చెల్లింపులకు 10, మండల సమైక్య చెల్లింపులకు 5 చొప్పున మార్కులు ఇస్తారు.

పొదుపు సంఘాలపై ప్రత్యేక దృష్టి 
డ్వాక్రా సంఘాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. క్రమం తప్పకుండా సమావేశాలు, పొదుపు పుస్తకాల నిర్వహణ, సభ్యుల హాజరు వంటివి ప్రామాణికంగా తీసుకుంటారు. సంఘాల పనితీరును బట్టి 12 అంశాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు కేటాయిస్తాం.  
– వై.రామకృష్ణ, పీడీ, డీఆర్‌డీఏ, ఏలూరు

మరిన్ని వార్తలు