‘ఆసరా’ సంబరం.. ఊరూరా అంబరం 

17 Oct, 2021 05:01 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మహిళలు

ఇప్పటికే 6.10 లక్షల సంఘాల ఖాతాల్లో రూ.4,923 కోట్లు జమ 

శనివారం ఒక్కరోజే డ్వాక్రా మహిళలకు రూ.1,108 కోట్లు చెల్లింపు 

7వ తేదీ నుంచి కొనసాగుతున్న కార్యక్రమం  

రేపటితో వైఎస్సార్‌ ఆసరా రెండో విడత డబ్బుల పంపిణీ పూర్తి 

వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారులు 

రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సీఎం జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్సార్‌ ఆసరా రెండవ విడత సొమ్ము డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో విజయవంతంగా జమ అవుతుండటాన్ని పురస్కరించుకుని అక్కచెల్లెమ్మలు ఊరూరా పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల నాటికి వారి పేరిట బ్యాంకుల్లో అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి శనివారం వరకు 6,10,262 పొదుపు సంఘాలకు రూ.4,923.33 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రెండో విడతగా జమ చేసింది. శనివారం 1,35,430 సంఘాలకు సంబంధించి రూ.1,108 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా ప్రకటించిన ప్రకారం.. సోమవారం మరో 1.45 లక్షల సంఘాలకు రూ.1,176 కోట్లు జమ చేసే అవకాశం ఉంది. దీంతో 12 జిల్లాల పరిధిలో లబ్ధిదారులందరికీ వైఎస్సార్‌ ఆసరా రెండో విడత డబ్బుల చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.

బద్వేలు ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్‌తో వైఎస్సార్‌ జిల్లాలో ఈ చెల్లింపులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. గతంలో చంద్రబాబులా మోసం చేయకుండా.. ఎన్నికల ముందు చెప్పినట్టు గత రెండేళ్లగా తమ పొదుపు సంఘాల అప్పు డబ్బును అందజేస్తున్న ముఖ్యమంత్రి పట్ల మహిళలు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు చాటుకుంటున్నారు. ఈ సొమ్ము పంపిణీ ప్రారంభమైన 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లబ్ధిదారులు సంబరాలు కొనసాగిస్తున్నారు. శనివారం 12 జిల్లాల పరిధిలో 70 చోట్ల లబ్ధిదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు.  

ఊరూరా సంబరాలు 
► తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ తొర్రేడులో ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌రామ్,  కొత్తపేట మండలం వానపల్లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కాకినాడ డైరీ ఫారం సెంటర్, తుని మండలం గెడ్లబీడు, శంఖవరం వద్ద జరిగిన కార్యక్రమాల్లో కాకినాడ ఎంపీ వంగా గీత, అల్లవరంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేశారు. పలుచోట్ల సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.   
► పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. కొవ్వూరు మండలంలో మంత్రి తానేటి వనిత చెక్కులు పంపిణీ చేశారు.   
► విశాఖ జిల్లా చోడవరంలో ఎంపీ బీవీ సత్యవతి, పెదబయలులో జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర చెక్కులు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడలోని విద్యాధరపురం లేబర్‌కాలనీలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,  గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక పాల్గొన్నారు.  
► అనంతపురం జిల్లా సోమందేపల్లిలో మంత్రి శంకరనారాయణ, చిలమత్తూరులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. 
► చిత్తూరు జిల్లా మదనపల్లె, పీలేరులో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బంగారుపాళెం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ రెడ్డెప్ప హాజరయ్యారు.   
► ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో మంత్రి సీదిరి అప్పలరాజు స్వయం సహాయక సంఘ సభ్యులకు వైఎస్సార్‌ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు.   

మరిన్ని వార్తలు