31న అమరావతి టౌన్‌షిప్‌ ప్లాట్లకు ఈ–వేలం

26 May, 2022 08:34 IST|Sakshi

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఈ నెల 27 వరకు అవకాశం

285 ఎకరాల్లో 1,327 ప్లాట్ల అభివృద్ధి.. ఇప్పటికే 931 విక్రయం

మరో 331 ప్లాట్లను వేలం వేసేందుకు సీఆర్డీఏ నిర్ణయం

ప్రస్తుతం 29 ప్లాట్లకు ఈ–వేలం.. ఎవరైనా కొనుగోలు చేయవచ్చన్న సీఆర్డీఏ కమిషనర్‌

సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి–నవులూరు వద్ద అభివృద్ధి చేసిన అమరావతి టౌన్‌షిప్‌లోని మిగిలిన ప్లాట్లకు కూడా ఈ–వేలం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నిర్ణయించింది. ఈ ప్రాంతంలో మొత్తం 285.17 ఎకరాల్లో 1,327 ప్లాట్లను అభివృద్ధి చేయగా.. దాదాపు 931 ప్లాట్లను గతంలో విక్రయించారు. మరో 331 ప్లాట్లను వివిధ లాట్‌లుగా విభజించిన సీఆర్డీఏ.. ఇందులో 29 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది.

ఈ వివరాలను సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. 200 చదరపు గజాల చొప్పున 23 ప్లాట్లు, 1,000 చదరపు గజాల చొప్పున ఉన్న ఆరు ప్లాట్లకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం చదరపు గజానికి రూ.17,800గా ధర నిర్ణయించిందని, ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31వ తేదీ ఉదయం నుంచి ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు  https:// konugolu. ap. gov. in Ìôæ§é  https:// crda. ap. gov. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

క్రికెట్‌ స్టేడియం, ఎయిమ్స్‌కు అతి దగ్గరలో..
నవులూరు వద్ద జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ లే అవుట్‌లోని ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయని.. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ చెప్పారు. ప్లాట్లకు అతి దగ్గరలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, అకాడమీ, ఎయిమ్స్‌ ఆస్పత్రితో పాటు మంగళగిరి రైల్వేస్టేషన్‌ తదితర సదుపాయాలు ఉన్నాయని, త్వరలో మరికొన్ని జాతీయ విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.1,180 ఫీజు చెల్లించి ‘కొనుగోలు’ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. అమరావతి టౌన్‌షిప్‌ ప్లాట్లను వేలంలో ఎవరైనా దక్కించుకోవచ్చని చెప్పారు. వివరాలకు 0866–246370/71/72/73/74 నంబర్లను సంప్రదించాలన్నారు. 

మరిన్ని వార్తలు