ఏపీ ఎంసెట్‌ పరీక్ష ప్రారంభం

17 Sep, 2020 09:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీ. ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్ష గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం రెండు సెషన్లలో జరగనున్న ఎంసెట్‌ పరీక్షలు ఈ నెల 25 వరకు 14 సెషన్లలో ఏడు రోజుల పాటు సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు.  ప్రతిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.

ఈనెల 17, 18, 21, 22, 23 తేదీల్లో ఇంజినీరింగ్, 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, బీ.ఫార్మసీ విభాగాల్లో మొత్తం 2,72 ,900 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 47 పట్టణాల్లో 118 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ 
ఎంసెట్‌కు నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రవీంద్ర తెలిపారు. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను కోవిడ్‌ మార్గదర్శకాలతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. పరీక్ష హాలులో విద్యారి్థకి విద్యార్థి మధ్య 4నుంచి 6 అడుగులు భౌతిక దూరం ఉండేలా బల్లలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  పరీక్షకు ముందు, తరువాత పరీక్ష కేంద్రాలను పూర్తిస్థాయిలో శానిటైజన్‌ చేయించనున్నట్లు తెలిపారు.

విద్యార్థులను థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ శానిటైజేషన్‌ చేసిన తరువాతనే లోనికి అనుమతిస్తామని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారి వెంట 50ఎంఎల్‌ హ్యాండ్‌ శానిటైజర్, అలాగే పారదర్శక వాటర్‌ బాటిల్‌ను వెంట తెచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ముందస్తుగా పరీక్ష రాసేసినప్పటికి పరీక్ష సమయం పూర్తయ్యేవరకు విద్యార్థులు  కేంద్రంలోనే ఉండాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్‌ అడ్మిట్‌ కార్డు, ఏదేని ఫొటో ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని ఆయన తెలిపారు.  


Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు