సర్వే కాకమునుపే పరిహారమా! 

16 Dec, 2022 11:03 IST|Sakshi

 రాజోలిపై ఈనాడు అసత్యపు రాతలు

2014లో పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం

తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజోలి నిర్మాణం చేపట్టిన వైఎస్‌ జగన్‌

జమ్మలమడుగు(వైఎస్సార్‌ జిల్లా): పెద్దముడియం మండలంలోని రాజోలిపై నిర్మించే ఆనకట్టపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాజోలి ఆనకట్ట నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబర్‌ 23న శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు ఈ ఆనకట్ట గురించి పట్టించుకోకపోవడంతో నిర్మాణం అటకెక్కింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజోలి నిర్మాణం కోసం ముందుకు వచ్చారు.

ముంపు గ్రామాల ప్రజలతో పరిహారం విషయమై ఎమ్మెల్యే డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు మాట్లాడి ఎకరాకు 12.5 లక్షల రూపాయలు అందించే విధంగా ప్రతిపాదించగా రైతులు సైతం ఆమోదం తెలిపారు. వాస్తవం ఇలా ఉండగా ఈనాడు దినపత్రికలో పరిహారమేదంటూ కథనాన్ని ప్రచురించి ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నం చేసింది. దీనిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు కూడా పూర్తి కాకుండా పరిహారం ఎలా ఇస్తారంటూ ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్‌డీసీ రాములు నాయక్‌లు ప్రశ్నిస్తున్నారు. 

భూములకు సర్వే మాత్రమే జరుగుతోంది  ఐదు ముంపు గ్రామాలలో  రైతుల వద్దనుంచి భూమి సేకరణ, ఇళ్లకు సంబంధించిన సర్వే మాత్రమే జరుగుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో సర్వే జరగలేదు. సర్వే పూర్తి అయి, అవార్డులు ప్రకటించిన తర్వాత రైతులకు పరిహారం అందుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే పరిహారం ఎలా అందుతుందని రెవెన్యూ, జీఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు పరిహారం రెండు నెలల్లో తాము ఇస్తామని ఎక్కడా చెప్పలేదని ఆర్డీఓ జి.శ్రీనివాసులు స్పష్టం చేస్తున్నారు. రైతులకు, గ్రామస్తులకు  అవార్డులు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పరిహారం పంపిణీ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

రాజోలిని పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం  
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుందూనదిపై రాజోలి ఆనకట్ట నిర్మాణం కోసం 2008 డిసెంబర్‌ 23న శంఖుస్థాపన చేశారు.  మొదట రూ.300 కోట్లతో టీఎంసీ నీటిని నిల్వ ఉంచేలా నిర్మాణం చేపట్టాలని భావించారు.  తర్వాత దాని సామర్థ్యాన్ని 2.9 టీఎంసీలకు పెంచారు. వైఎస్‌ మరణానంతరం వచ్చిన పాలకులు ఎవ్వరూ దీని గురించి పట్టించుకోలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజోలి ఊసే ఎత్తలేదు. 

రాజోలి ఆనకట్ట కింద ముంపునకు గురయ్యే గ్రామాలు ఇవీ.. 
 నెమళ్లదిన్నె, బలపనగూడూరు, గరిశలూరు, చిన్నముడియం, ఉప్పలూరు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురి అవుతాయి. ఈ గ్రామాలనుంచి 9286 ఎకరాల భూమిని సేకరించాలి. 

సర్వే జరుగుతోంది 
కుందూ నదిపై నిర్మించే రాజోలి ఆనకట్టకు సంబంధించి ముంపునకు గురైన బలపనగూడురు, ఉప్పలూరు,  నంద్యాల జిల్లా గొట్లూరు గ్రామాలలో సర్వే జరుగుతోంది. ఇప్పటి వరకు 1745 ఎకరాలకు అవార్డు ప్రకటించాం.    
–  రామునాయక్, ఎస్‌డీసీ జీఎన్‌ఎస్‌ఎస్‌–3 

ఏడువేల ఎకరాల భూమిని సేకరించాలి  
రాజోలిపై నిర్మించే ఆనకట్ట నిర్మాణం కోసం రైతుల వద్ద నుంచి ఏడువేల ఎకరాల భూమిని సేకరించాలి. దాని కోసం రెవెన్యూ , జీఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు ప్రత్యేక టీంగా ఏర్పడి సర్వే చేస్తున్నాం. ఇంకా సర్వే పూర్తి కాలేదు. సర్వే పూర్తిచేసి అవార్డులు ప్రకటించిన తర్వాత మొత్తం పరిహారం కోసం ప్రతిపాదనలు జీఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు పెడతారు. 
 –జి.శ్రీనివాసులు , ఆర్డీఓ ,జమ్మలమడుగు 

మరిన్ని వార్తలు