..మీరు క్షేమమేనా?

29 Sep, 2020 12:52 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో సర్వే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ పంచాయతీల వారీగా జీవన సౌలభ్యం(ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌) సర్వే చేపట్టారు. ఎంపీడీవోలు, ఈవోఆర్‌డీల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్‌ అసిస్టెంట్లు, వలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 1038 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. దాదాపుగా 36 లక్షల మంది జనాభా ఉన్నారు. మొత్తం 884 గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. పెన్షన్లు, రేషన్‌ కార్డులను గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నారు.

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, జగనన్న చేదోడు, ఆటోవాలాలు, టైలర్లు, బార్బర్లకు ఏటా రూ.పది వేలు.. ఇలా అనేక సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు పేద కుటుంబాలకు వరంలా మారాయి. రైతులకు ఉచిత బోర్లు వేయించే పథకం ప్రారంభమైంది. అయితే ఈ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయమై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. 

59 శాతంపైగా సర్వే పూర్తి 
ఈవోఎల్‌ సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 17 అంశాలపై 32 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. కనీస అవసరాలైన గ్యాస్‌ కనెక్షన్, కరెంట్, రైస్‌ కార్డు, జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన తదితర అంశాలపై సర్వే కొనసాగుతోంది. ఇంకా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై సర్వే జరుగుతోంది. యువతకు జీవనోపాధిని కల్పించే నైపుణ్యా శిక్షణ తరగతులు, జీవిత బీమా, ప్రమాద బీమా, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, గృహ నిర్మాణ సదుపాయంపై ప్రజలను ప్రశ్నలు అడుగుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు లబ్ధిదారుల ఫోన్‌ నంబర్లు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సర్వే 59 శాతంపైగా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా ఎలాంటి పథకాలు అందిస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయో సరి చూసుకోవడానికి ఈ సర్వే చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 30వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలని ఎంపీడీవోలు, ఈవోఆర్‌డీలు, పంచాయతీ సెక్రటరీలను జిల్లా పరిషత్‌ సీఈవో కైలాష్‌ గిరీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి ఆదేశించారు.

మరిన్ని వార్తలు