అవినీతి తుపా‘కీ’ ఎక్కడ 

20 Nov, 2021 11:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాగితాలపైనే వేలంపై నిఘా నేత్రం

రంగంలోకి అవినీతి నిరోధక శాఖ

డీజీ కార్యాలయం కేంద్రంగా విచారణ

డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి: అవినీతి తుపాకీ లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చిన బాధ్యులను గుర్తించేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే నిఘా వర్గాలు 15 పేజీల నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్టు తెలిసింది. పాత్రధారులు ఎవరు, ఏ రీతిన వారు అవకతవకలకు పాల్పడ్డారనే దానిపై ప్రాథమిక సమాచారం నివేదించారు.

ఏసీబీ కూడా లోతైన విచారణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు విజయవాడ ఏసీబీ డీజీ రామాంజనేయులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఏసీబీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ విచారణను పర్యవేక్షించనున్నారు. శరత్‌బాబు అనే డీఎస్పీ విచారణాధికారిగా నియమితులయ్యారు. ఇద్దరు ఇనస్పెక్టర్లు, నలుగురు సబ్‌ ఇనస్పెక్టర్లు ఈ బృందంలో ఉంటారు.

సీరియస్‌గా పరిగణన
డీజీ స్థాయిలో ఈ వ్యవహారాన్ని ప్రాధాన్య అంశంగా భావించి పారదర్శకంగా విచారణ జరపనున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలుండాలనే నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చారు. వేలం నిర్వహించకుండా కాగితాల్లో జరిపినట్లు చూపించారనే విషయం ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వివిధ రకాల 582 తుపాకులకు వేలం పెట్టే ముందు నిబంధనల ప్రకారం ఎక్కడో ఒకచోట బహిరంగంగా ప్రదర్శించాలి. ఈ ప్రక్రియ ఎక్కడా నిర్వహించిన దాఖలాలు లేవు. 

ఈ నేపథ్యంలోనే పలువురి సొంతమైన తుపాకులను తిరిగి స్వాధీనం చేసుకుని ఆర్మ్‌డ్‌ రిజర్వులో భద్రపరిచారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ధ్రువీకరించారు. వేలం నిర్వహించినట్టు చెబుతున్న ప్రక్రియతో పాటు తుపాకీ లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తమకు తెలియకుండా తుపాకులను వేలం వేసేశారని వచ్చిన ఫిర్యాదులపై కూడా ఏసీబీ దృష్టి కేంద్రీకరించనుంది. మొత్తం 582 తుపాకుల్లో విలువైన వాటిని బినామీ పేర్లతో రూ.20 వేలు, రూ.30 వేలకు సొంతం చేసుకున్న పోలీసు అధికారుల చిట్టాను నిఘా వర్గాలు ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించినట్టు భోగట్టా. 

మరిన్ని వార్తలు