‘అయ్యన్న పోలీసులకు క్షమాపణ చెప్పాలి’

25 Nov, 2021 15:22 IST|Sakshi

తూర్పుగోదావరి జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షడు సత్యమూర్తి, కార్యదర్శి వైఆర్కే శ్రీనివాస్

సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు విజ్ఞతతో మాట్లాడాలని జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షడు సత్యమూర్తి, కార్యదర్శి వైఆర్కే శ్రీనివాస్ అన్నారు. వారిద్దరూ గురువారం మీడియతో మాట్లాడుతూ.. అయ్యన్న మాటలు వీధి రౌడీలు ఉపయోగించే భాష కంటే నీచంగా ఉన్నాయని మండిపడ్డారు. ఆయన పిల్లలకు మాత్రమే అయ్యన్న తండ్రి అని.. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారని తెలిపారు.

అయ్యన్న పాత్రుడు అధికారంలో ఉండగా పోలీసు సేవలను ఎంతగానో ఉపయోగించుకున్నారని గుర్తుచేశారు. తన రాజకీయ ఉనికి కోసం పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు దుర్భషలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని.. అరాచకవాదిలా మాట్లాడొద్దని హితవు పలికారు. సరైన భాషలో మాట్లాడకపోతే ప్రజలే అయ్యన్నను పరుగెత్తించి కొడతారని హెచ్చరించారు. అయ్యన్నను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని తెలిపారు. పోలీసులకు అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసరమైతే అయ్యన్న పాత్రుడుపై ప్రైవేటు కేసులు కూడా వేస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు