ఎస్‌ఎస్‌ఏ పోస్టుల భర్తీలో టీడీపీ నేతల మాయాజాలం

11 Jun, 2022 19:27 IST|Sakshi

2019 జనవరిలో అవినీతి బాగోతం

42 ఉద్యోగాల భర్తీలో ‘తమ్ముళ్ల’ చేతివాటం

పోస్టుకు రూ.రెండు మూడు లక్షల వసూలు

ఏసీబీ చేతిలో నాటి ఫైళ్లు

హడలెత్తుతున్న ఉద్యోగులు  

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయంటారు పెద్దలు. అది నిజమని తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో మరోసారి తేలిపోయింది. అప్పటికి అధికారం చేతిలో ఉంది కదా అని కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీలో తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా లక్షల రూపాయలు మింగేశారు. అధికారానికి చివరి ఘడియల్లో ఉన్న సమయంలో నాలుగేళ్ల క్రితం.. 2019లో ఈ అవినీతి బాగోతాన్ని గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేశారు. నాటి పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు ఇటీవల అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల బండారం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కార్యాలయంలో నాటి ఫైళ్లను సీజ్‌ చేశారు. దీంతో నాడు పోస్టుల భర్తీలో చక్రం తిప్పిన అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ పోస్టుల మాయాజాలం వివరాలివీ.. 

నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో.. 
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను 2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏకి అప్పగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఏలో ఖాళీగా ఉన్న 2,600 పైగా పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 400 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. వీటిలో అన్ని కేటగిరీలకూ చెందిన 242 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఇండియన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ పేరుతో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ, ఎస్‌ఎస్‌ఏ అధికారులు కీలక పాత్ర పోషించారు. 


భారీ పోటీయే అవకాశంగా.. 

మార్కులు, రోస్టర్‌ పాయింట్లు, కులం ప్రాతిపదికన ఏర్పాటు చేసిన మార్గదర్శకాలతో ఉద్యోగ నియామకానికి సమగ్ర శిక్ష అధికారులు ప్రకటన విడుదల చేశారు. పోస్టును బట్టి రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ జీతం ఉండటంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంట్రాక్టు పోస్టులే అయినప్పటికీ ప్రభుత్వంలో పని చేసిన సర్వీసు రికార్డు, ఎప్పుడైనా క్రమబద్ధీకరిస్తారనే ఆశతో మొత్తం 242 పోస్టులకు 3 వేల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు నలుగురైదుగురి వరకూ పోటీ పడ్డారు. ఇదే అదనుగా తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. కాకినాడ ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో చక్రం తిప్పిన ఉద్యోగులతో కుమ్మక్కై లక్షల రూపాయలు దిగమింగి పోస్టింగులు ఇచ్చేశారు. పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసి మింగేశారు.

తెలుగు తమ్ముళ్లే తెర వెనుక ఉండి ఈ మొత్తం వ్యవహారం నడిపించడంతో అప్పట్లో పెదవి విప్పేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అయితే ఆ పాపం పండే రోజు రానే వచ్చింది. అనర్హులకు కూడా పోస్టింగులు ఇవ్వడంతో కడుపు మండిన అర్హుల్లో పలువురు ఈ బాగోతంపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నాటి పోస్టుల భర్తీకి సంబంధించి సమగ్ర సమాచారాన్ని రెండు రోజుల క్రితమే కాకినాడలోని ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. నాడు జరిగిన పోస్టుల భర్తీ ప్రక్రియ, నియమితులైన వారి విద్యార్హతలు తదితర వివరాలు సేకరిస్తున్నారు. 


నాటి ముఖ్య ప్రజాప్రతినిధి ప్రమేయం! 

కాకినాడకు చెందిన అప్పటి టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి, కాకినాడ ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్‌)లో ఔట్‌సోర్సింగ్‌ వ్యవహారాలను చక్కబెట్టిన, నాడు టీడీపీ ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు తెర వెనుక ఉండి ఈ బాగోతాన్ని నడిపించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు చక్రం తిప్పారనే కోణంలో విచారణ సాగుతోంది. పోస్టులను పంచేసుకుని ఒక్కో ఉద్యోగానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేసిన ఉద్యోగులు ఎవరు, వారిలో ఎవరి పాత్ర ఎంత, వారికి సహకరించిన బయటి వ్యక్తులు ఎవరనే వివరాలను ఏసీబీ సేకరిస్తోంది.

అర్హతల ఆధారంగా రోస్టర్‌ పాయింట్లు లేకపోవడం, లేని విద్యార్హతలు సృష్టించి పోస్టుల భర్తీలో అవకతవకలకు పాల్పడటం వంటివి జరిగాయని చెబుతున్నారు. ఈ పరిణామంతో నాడు పోస్టుల భర్తీలో తెలుగు తమ్ముళ్లతో మిలాఖత్‌ అయిన అధికారులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పై నుంచి కింది స్థాయి వరకూ సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు నాలుగైదు పోస్టుల వంతున పంచేసుకుని.. రూ.లక్షలు దిగమింగిన విషయం ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది.

మరిన్ని వార్తలు