అంతర్జాతీయ క్రీడా వేదికపై తూగో జిల్లా ఆదివాసి బిడ్డ

12 Aug, 2021 10:20 IST|Sakshi
అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఆదివాసీల ముద్దు బిడ్డ కుంజా రజిత 

కట్టెలమ్ముకునే కుటుంబ నేపథ్యం 

దారి కూడా లేని అటవీ గ్రామం 

అంతర్జాతీయ వేదికపై ఓ ఆదివాసీ బిడ్డ  

నైరోబి అథ్లెటిక్స్‌కు ఎంపిక 

కూనవరం(తూగో జిల్లా): కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు..అడవిరాముడు చిత్రం కోసం వేటూరి రాసిన ఈ గీతం ఓ స్ఫూర్తి మంత్రం..నిజమే..కొండ కోనల్లో కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఓ అడవిబిడ్డ ఎంతో కష్టపడింది. పరుగులో రాణించేందుకు అహరహం శ్రమించింది. ఇప్పుడు కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది.  పట్టుదల..కఠోర సాధనతో ఈ బాలిక విజయపథాన రివ్వున దూసుకెళుతోంది.  

కుటుంబ సభ్యులతో రజిత 


కుగ్రామం నుంచి.. 
కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురం. చుట్టూ దట్టమైన అడవి తప్ప మరేమీ కనిపించదు.  35 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇక్కడికి వలసవచ్చింది మారయ్య కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితి. కుంజా మారయ్య..భద్రమ్మ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు ..ఇద్దరు ఆడపిల్లలు.

ఇందులో ఆఖరి బిడ్డ రజిత. భర్త చనిపోయాక భద్రమ్మ అడవికి వెళ్లి కట్టెలు సేకరించడం ద్వారా పిల్లల్ని పోషిస్తోంది.  రజిత రోజూ చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి చదువుకునేది. 1 నుంచి 8వ తరగతి వరకు అక్కడ చదివింది. సెలవులు ఇచ్చినప్పుడు తల్లి వెంట కట్టెలు తెచ్చి చేదోడు వాదోడుగా నిలిచేది. పరుగులో తొలినుంచి ఈమెలో వేగాన్ని పెద్దన్న జోగయ్య గమనించాడు. చిన్నా చితకా పరుగుపందెం పోటీల్లో పాల్గొని ముందు నిలిచేది.    

ఆగని పరుగు.. 
నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 తరగతులు చదివింది. అప్పుడే నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్‌ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్‌ శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీడియెట్‌ చదువుతూ గుంటూరులో శాప్‌ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకె రసూల్‌ వద్ద అథ్లెటిక్స్‌ శిక్షణ తీసుకుంది. 2019లో అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్‌ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో విశేష ప్రతిభ కనబర్చింది.  ఈ నెల 17న కెన్యాలోని నైరోబిలో జరిగే అండర్‌–20 జూనియర్‌ అథ్లెటిక్‌ పోటీలకు ఎంపికైంది. తగిన ప్రోత్సాహముంటే దేశ కీర్తిని చాటేలా ప్రతిభ నిరూపించుకుంటానని రజిత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు