East Godavari: పెద్ద బండి.. మైలేజ్‌ సూపరండి.. ఇక ఈ ట్రాక్టర్‌...

31 Aug, 2021 08:02 IST|Sakshi

 ఆలోచనల్లో ‘ఘన’పతి

ఆల్ట్రేషన్‌తో సరికొత్త వాహనాలకు సృష్టి

మైలేజ్‌ పెంచడం, సాగుకు ఉపయుక్తంగా తీర్చిదిద్దిన వైనం

వై.రామవరం.. గిరిజన యువకుడి ప్రతిభ

ఎక్కడ పుట్టామన్నది కాదు.. మనమేం చేశామన్నది ముఖ్యం. అదే అందరిలో గుర్తింపు తెస్తోంది.. ప్రత్యేకంగా నిలుపుతోంది.. గిరిజన ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నాడు.. మైలేజ్‌ పెంచే బుల్లెట్‌ బండి, సాగులో దమ్ము చేసేందుకు వ్యర్థ వస్తువులను ఉపయోగించి ట్రాక్టర్లను తయారు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొంటున్నాడు.. ఆ ఆవిష్కరణలను మనమూ చూసొద్దాం రండి. 

ఎక్కడో మారుమూల కొండ ప్రాంతం.. అయితేనేం ప్రతిభకు కాదేదీ అనర్హం అని ఆ యువకుడు నిరూపిస్తున్నాడు. తన ఆలోచనలకు పదునుపెట్టి కొండ ప్రాంతాలకు అనుకూలమైన వివిధ వాహనాలను తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండల సరిహద్దు ప్రాంతమైన అడ్డతీగల మండలం వెదురునగరం గ్రామానికి చెందిన పట్నాల గణపతి (28) వివిధ వాహనాల తయారీలో ప్రత్యేకత చాటుతున్నాడు.

అతనికి ముగ్గురు అన్నదమ్ములు. 15 ఏళ్ల కిందట తండ్రి మృతి చెందడంతో కుల వృత్తితో పాటు సైకిల్‌ రిపేరింగ్, టైర్ల పంక్చర్లు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐటీఐలో కంప్యూటర్‌ కోర్సు చేసిన గణపతి మాత్రం మూడేళ్ల పాటు గుంటూరులోని బైక్, కార్లు, పెద్ద వాహనాల గ్యారేజీలో పని చేశాడు. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర కిందట స్వగ్రామమైన వెదురునగరం వచ్చి సోదరులతో కలసి పని చేసుకుంటున్నాడు.

తపించి.. తయారు చేసి..
అక్కడితో ఆగిపోకుండా తన నైపుణ్యానికి పదునుపెట్టి వ్యర్థ పరికరాలను ఉపయోగించి సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. చిన్న డీజిల్‌ ఆయిల్‌ ఇంజిన్లు కొనుగోలు చేసి ఏజెన్సీలో కొండప్రాంత దుక్కులకు, వరి పొలాల దమ్ములకు అనువుగా వివిధ మోడళ్లలో చిన్న ట్రాక్టర్లు తయారు చేస్తున్నాడు. పురాతన పెట్రోల్‌ బుల్లెట్‌ మోటార్‌ సైకిళ్లను సేకరించి వాటికి డీజిల్‌ ఇంజిన్లతో ఆల్ట్రేషన్‌ చేస్తున్నాడు. లీటరు పెట్రోల్‌తో 30 కిలోమీటర్లు నడిచే బుల్లెట్‌కు డీజిల్‌ ఇంజిన్‌ అమర్చడంతో సుమారు 90 కిలోమీటర్ల వరకూ వస్తోందని గణపతి ఆనందంగా చెబుతున్నాడు.

‘దమ్ము’.. చేస్తుంది 
వరి పొలాల్లో దమ్ములు చేయడానికి తయారు చేసిన ట్రాక్టర్‌ ఇది. దీనికి కారు డ్రమ్ములు, దమ్ము వీల్స్‌ ఉపయోగించారు. నీటిని తోడే చిన్న డీజిల్‌ ఇంజిన్‌ అమర్చారు. కారు వీల్‌ డ్రమ్ములతో దమ్ము చేసే చక్రాలు తయారు చేశారు. దీనికి కొన్ని చిన్న ట్రాక్టర్‌ సామాన్లు వినియోగించారు. వరి పొలాల్లో దమ్ములు చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు.

పార్ట్‌లు వేరు.. పనితీరు బంపరు
చిత్రంలో కనిపిస్తున్నది పొలాల్లో దుక్కులు దున్నడానికి తయారు చేసిన ట్రాక్టర్‌. బైక్‌ హ్యాండిల్, నీరు డీజిల్‌ ఇంజిన్, కూర్చునేందుకు ప్లాసిక్‌ కుర్చీ అమర్చారు. పాత ట్రాక్టర్‌ సామగ్రి కొంత ఉపయోగించారు. ట్రాక్టర్‌ ముందు భాగంలో బైక్‌ చక్రం, పైన కారు స్టీరింగ్, ఇనుప గొట్టాలు, రాడ్లతో చాసిస్‌ తయారు చేశారు. వెనుక దుక్కు చేయడానికి అనువుగా ఐరన్‌ రాడ్లు, పారలు బిగించారు. దీనికి రూ.50 వేలు అయ్యింది. 

పెద్ద బండి.. మైలేజ్‌ సూపరండి
డీజిల్‌ ఇంజిన్‌ అమర్చి, గణపతి తయారు చేసిన డీజిల్‌ బుల్లెట్‌ ఇది. దీనికి పాత బుల్లెట్‌ చాసిస్‌ ఉపయోగించారు. పాత పెట్రోల్‌ ఇంజిన్‌ బదులు నీటిని తోడే చిన్న డీజిల్‌ ఇంజిన్‌ వాడారు. దీంతో లీటరుకు 90 కిలోమీటర్లు పైగా మైలేజీ వస్తోంది. ఇలా సొమ్ము ఆదా అవుతోంది. ఈ వాహనానికి రూ.లక్ష ఖర్చు చేశారు.

ప్రత్యేకత చూపడానికే..
చిన్నతనం నుంచీ నాకు బైక్‌లంటే ఇంట్రస్ట్‌. బుల్లెట్‌ బండి ఎక్కి తిరగాలని చాలాసార్లు అనిపించేంది. అమ్మో.. అసలే పెద్ద బండి.. ఆపై పెట్రోల్‌ భారం మోయలేమని అనుకునేవాడిని. అప్పుడే డీజిల్‌తో ఆ బండిని చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. ఇప్పుడు నేను చేసిన బండిపై రయ్‌.. రయ్‌మంటూ తిరుగుతున్నా. ఇక్కడ దుక్కులకు అందరూ ఎడ్లను వినియోగిస్తారు. వారికి అనువుగా ఉండేలా వివిధ పరికరాలు ఉపయోగించి ప్రత్యేక ట్రాక్టర్లు తయారు చేస్తున్నా. ఇది వ్యాపారం చేయడానికో, వాహన కంపెనీలను కించపరచడానికో కాదు. నా ప్రత్యేకత చాటడానికే.
– పట్నాల గణపతి, వెదురునగరం

చదవండి: పులస.. తగ్గుతోంది వలస
గోదారి ఒడిలో ఎగసిన క్రీడాతరంగం..

మరిన్ని వార్తలు