కింగ్‌ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..

6 Mar, 2023 04:34 IST|Sakshi

కింగ్‌ కోబ్రాల గూళ్ల సంరక్షణకు నడుం కట్టిన తూర్పు కనుమల వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, అటవీ శాఖ

వాటి గూళ్లను అటవీ జంతువులు ధ్వంసం చేస్తుండటంతో తగ్గిపోతున్న సంఖ్య

సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్‌ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్‌ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది.

ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరు­వాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్ల­లు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్‌ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. 

ఎలా రక్షిస్తున్నారంటే..
మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్‌ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి.

ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. 


వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. 
కింగ్‌ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్‌ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. 

కింగ్‌ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం
ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్‌ కోబ్రా కన్జర్వేషన్‌ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం.    – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్‌ సొసైటీ

మరిన్ని వార్తలు