పర్యావరణహిత టీటీడీ 

10 Jan, 2022 04:23 IST|Sakshi
టీటీడీలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు బీఈఈ సహకారం అందిస్తోందనే ప్రచార చిత్రంతో ఈఓ జవహర్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

నెట్‌ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్‌కు ఎంపిక

ఇంధన సామర్థ్య చర్యలతో విద్యుత్‌ ఆదాకు కృషి  

సాక్షి, అమరావతి: దేశంలోని పర్యాటక, యాత్రా స్థలాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సంకల్పించింది. ఇందులో భాగంగా ‘నెట్‌ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్‌’ ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, జమ్మూ కశ్మీర్‌లలోని పర్యాటక ప్రాంతాలతో పాటు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను ఎంపిక చేసింది. ఇంధన సామర్థ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై నెడ్‌క్యాప్‌తో కలిసి బీఈఈ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత ఇంధన సామర్థ్యం కలిగిన వాటర్‌ పంపింగ్‌ సిస్టమ్, ఫ్యాన్లు, లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను బీఈఈ సౌజన్యంతో ఇంధన పరిరక్షణ మిషన్‌ ఆధ్వర్యంలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ సహకారంతో తిరుమలను కాలుష్య రహితంగా, పర్యావరణ హిత, ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలోని కళాశాలలు, పాఠశాలలు, తిరుమలలోని టీటీడీ భవనాల్లో 2.2 మెగావాట్ల రూఫ్‌ టాప్‌ సోలార్‌ సిస్టమ్, పవన విద్యుత్‌ ప్రాజెక్టులు, బయోగ్యాస్‌ ప్లాంట్లు, విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు  ఏర్పాటు చేయడానికి నెడ్‌ క్యాప్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

మరింత మెరుగ్గా ముందుకు.. 
భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీలో సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో జవహర్‌రెడ్డి చెప్పారు. టీటీడీ, ఇంధన శాఖ అధికారులతో వర్చువల్‌ విధానంలో ఆయన సమీక్ష జరిపారు. ఈ వివరాలను ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. టీటీడీ భవనాల్లో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన కార్యక్రమల ద్వారా కొంత మేర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆధునిక, ఇంధన సామర్థ్య, పునరుత్పాదక కార్యక్రమాలు చేపట్టడంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. 2070 నాటికి కాలుష్య రహిత దేశంగా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రముఖ యాత్రా స్థలాల్లో నెట్‌ జీరో ఎనర్జీ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు బీఈఈ  డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే తమకు పంపిన సందేశంలో పేర్కొన్నట్లు నెడ్‌ క్యాప్‌ ఎండీ ఎస్‌.రమణారెడ్డి వెల్లడించారు.  

మరిన్ని వార్తలు