రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి

23 Mar, 2021 05:24 IST|Sakshi
అధికారులతో సమావేశమైన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

ప్రణాళికలు రూపొందించండి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేయనున్నామని, ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం సీఎస్‌ అధ్యక్షతన ఎకో టూరిజం డెవలప్‌ మెంట్‌ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడుతూ.. ఎకో టూరిజం అభివృద్ధి చేసూ్తనే.. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ అధికారులు, అటవీ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వచ్చే నెల 15వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి పూర్తి ప్రణాళికలతో రావాలని ఆదేశించారు.

ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ప్రవీణ్‌ కుమార్‌ ఎకో టూరిజం అభివృద్ధికి తీసుకోబోయే చర్యల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, ఇందులో భాగంగా సీఎస్‌ చైర్‌ పర్సన్‌గా టూరిజం డిపార్టుమెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ  కార్యదర్శి వైస్‌ చైర్‌ పర్సన్లుగా,  ఏపీ టూరిజం అథారిటీ సీఈవో సభ్య కన్వీనర్‌గా, మరో ఎనిమిది శాఖల ఉన్నతాధికారులతో ఎకో టూరిజం కమిటీని  ఏర్పాటు చేసిందన్నారు.

కమిటీ రాష్ట్రంలో సుందరమైన అటవీ ప్రాంతాలను గుర్తించి, ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో  ఎకో టూరిజం అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నా మన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఎకో రిస్టార్టులు, జంగిల్‌ లాడ్జిల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఏపీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రదీప్‌ కుమార్, మున్సిపల్, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్టు అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు