ఈడీ విచారణ: ఆ ‘స్కిల్‌’ ఎవరిది?

6 Dec, 2022 07:56 IST|Sakshi

చంద్రబాబు హయాంలో కుంభకోణంపై ఈడీ విచారణ షురూ

షెల్‌ కంపెనీల ప్రతినిధులను విచారించిన ఈడీ

విచారణకు హాజరుకాని చంద్రబాబు సన్నిహితులు

నిధులు ఇక్కడి నుంచి సింగపూర్‌కు, అక్కడి నుంచి తిరిగి ఏ ఖాతాలకు వచ్చాయో దర్యాప్తు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)’ కుంభకోణంలో సూత్రధారులెవరన్న విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) లోతుగా విచారణ మొదలు పెట్టింది. ఈ కేసులో నిందితులైన అప్పటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్‌ కంపెనీల ప్రతినిధులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నకిలీ ఇన్వాయిస్‌లతో ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు రూ. 241 కోట్లు కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించిన షెల్‌ కంపెనీల ప్రతినిధులను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోమవారం విచారించారు.

సీమెన్స్‌ కంపెనీ డిజైన్‌టెక్, స్కిల్లర్‌ తదితర షెల్‌ కంపెనీల ప్రతినిధులను అధికారులు వివిధ కోణాల్లో విచారించినట్టు తెలిసింది. అసలు ప్రాజెక్టు మొదలు పెట్టకుండానే సీమెన్స్‌ కంపెనీ పేరిట నిధులు విడుదల చేయడం, వాటిని కొన్ని షెల్‌ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సింగపూర్‌లోని మరో కంపెనీకి తరలించడంపై లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం. సింగపూర్‌ కంపెనీ నుంచి భారత్‌లో ఎవరి ఖాతాకు నిధులు బదిలీ చేశారనే గుట్టును ఛేదించేందుకు ఈడీ అధికారులు ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తోంది. నిధులు ఏఏ ఖాతాల్లోంచి సింగపూర్‌కు వెళ్లాయి, తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయంపై విచారణలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో పాత్రధారులైన అప్పటి ఎండీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకటకృష్ణప్రసాద్, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కె.ప్రతాప్‌కుమార్‌ తదితరులు ఈడీ విచారణకు హాజరుకాలేదు. 

మరిన్ని వార్తలు