AP ED Raids: ఈడీ సోదాలు.. కీలక రికార్డులు స్వాధీనం

2 Dec, 2022 13:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలోని పలు ఆసుపత్రుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో శుక్రవారం ఈడీ తనిఖీలు చేసింది. ఆసుపత్రిలో రికార్డులను ఈడీ అధికారులు పరిశీలించారు. రెండు బృందాలుగా విడిపోయి అధికారులు రికార్డులు తనిఖీ చేశారు. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. విజయవాడ అక్కినేని ఉమెన్స్‌ ఆసుపత్రిలోనూ ఈడీ తనిఖీలు చేసింది. రేపు కూడా ఆస్పత్రిల్లో తనిఖీలు చేయనుంది. 

ఈ రోజు తనిఖీల్లో ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి ఛైర్మన్‌తో సహా సిబ్బందిని ఈడీ ప్రశ్నించింది. అమెరికాలో వైద్యురాలుగా ఉంటూ విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని అక్కినేని మణి ప్రారంభించారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లింపు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. గతంలో ఎన్నారై ఆసుపత్రిలో డైరెక్టర్‌గా అక్కినేని మణి వ్యవహరించారు. అక్కినేని మణిని ఈడీ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. 

ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కోవిడ్‌ సమయంలోనూ భారీగా అవతవకలకు పాల్పడ్డారని గతంలోనే కేసు నమోదైంది. మాన్యువల్‌రసీదులు, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి మళ్లించారనే అభియోగాలు నమోదయ్యాయి. కోవిడ్‌ సమయంలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న 1500 మంది పేషెంట్ల వివరాలను రికార్డుల్లో చేర్చలేదని గతంలోనే అధికారులు పేర్కొన్నారు.  కొంత మంది ఉద్యోగుల సహకారంతో దొంగ ఖాతాలకు నగదు మళ్లింపులు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై హాస్పటల్‌కి సంబంధించి పరికరాల కొనుగోళ్లుపై అవకతవకలు జరిగాయని ఆరోపణలు రాగా, ఎంబీబీఎస్‌ ఫీజు రూపంలో కూడా కోట్లాడి రూపాయల మేర అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.  ఈ మేరకు గతంలో పనిచేసిన డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాధ్, అక్కినేని మణి, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్‌లు ఈడీ అధికారలు విచారిస్తున్నారు.

ఉమెన్స్ ఆస్పత్రి , ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో కీలక రికార్డులు స్వాధీనం
అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి, ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో పలు కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. నిధులు గోల్‌మాల్‌, మేనేజ్‌మెంట్‌ కోటాలోని మెడికల్ సీట్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

చదవండి: చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

>
మరిన్ని వార్తలు