స్కూళ్లలో బాలలపై లైంగిక వేధింపులకు చెక్‌

20 Aug, 2022 09:24 IST|Sakshi

సాక్షి అమరావతి: సుప్రీంకోర్టు, హైకోర్టు జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ ఆదేశాల మేరకు సూళ్లలో పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. లైంగిక వేధింపులు, పోక్సో చట్టం గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలని ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో పోస్టర్లు, ఫిర్యాదు పెట్టెలు ఉంచాలని తెలిపింది. విద్యార్థులందరికీ కనిపించేలా పోస్టర్లు ఉంచాలని, తగిన పరిమాణంలో తగిన మెటీరియల్‌తో కూడిన ఫిర్యాదు పెట్టె హెడ్‌మాస్టర్‌ గది వెలుపల ఉంచాలని సూచించింది. ఫిర్యాదులను ఈ పెట్టెలో వేయవచ్చు.

ఇతర ప్రధాన సూచనలు

  • పోస్టర్లలో ఏకరూపత ఉండాలి. పోస్టర్ల ముద్రణ, ఫిర్యాదు పెట్టె కోసం పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ నుండి నిధులు తీసుకోవచ్చు. 
  • తాళం ఉండే ఏదైనా చిన్న పెట్టెను ఫిర్యాదు పెట్టెగా ఉపయోగించవచ్చు
  • మండల విద్యాధికారి, ఇతర విభాగాల అధికారుల సమక్షంలో సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్, ఏఎన్‌ఎం 15 రోజులకు ఒకసారి ఫిర్యాదు పెట్టెను తెరిచి, అందులో ఉన్న ఫిర్యాదులను చదవాలి
  • ఫిర్యాదుపై అవసరమైన చర్యలకు వారు సంబంధిత శాఖకు తెలపాలి
  • ఏ విధంగానూ, ఏ సమయంలోనూ ఫిర్యాదుదారు వివరాలను బహిర్గతం చేయకూడదు. అత్యంత గోప్యంగా ఉంచాలి. ఎంఈవోలు డీఈవోలకు రెగ్యులర్‌ రిపోర్టును పంపాలి
  • డీఈవో ప్రతి నెలా 1,  15 తేదీల్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కి నివేదిక పంపాలి 

(చదవండి: ‘డిజిటల్‌’ ఫిష్‌: ‘ఫిష్‌ ఆంధ్ర’కు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం )

మరిన్ని వార్తలు