'పొగ'కు చెక్‌ పెడదాం

28 Sep, 2020 03:11 IST|Sakshi

స్మోక్‌ ఫ్రీ జోన్స్‌గా విద్యా సంస్థలు

పొగ నుంచి చిన్నారులను రక్షించేందుకు యత్నం

సాక్షి, అమరావతి: స్కూళ్లు పరిశుభ్రంగా ఉండటమే కాదు.. సిగరెట్, బీడీ, గుట్కా వంటి వాటి వాసన ఉండకూడదు. పొగ పొడ సూపకూడదు. స్కూలు, దాని పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలి. చిన్నతనం నుంచే పొగ అంటే చిన్నారులకు తెలియకూడదు. దాని ప్రభావానికి అసలే లోనుకాకూడదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా స్మోక్‌ ఫ్రీ జోన్స్‌గా స్కూళ్లను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం దీనిపై మార్గదర్శకాలు రూపొందించగా.. వాటిని అమలు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే కొన్ని స్కూళ్లను స్మోక్‌ ఫ్రీ జోన్‌లుగా అమలు చేస్తోంది.

ఈ కేటగిరీల్లో పక్కాగా నిబంధనలు 
► పొగ తాగే వారే కాదు.. అసలు పొగ ఆనవాళ్లు స్కూలు చుట్టూ కనిపించకూడదు. స్కూలులో పనిచేసే టీచర్లే కాకుండా స్కూలు డ్రైవర్లు పొగ తాగినా నేరమే. 
► ప్రతి స్కూలులో ముఖ ద్వారం వద్ద, లోపల గోడలపైన ‘టొబాకో లేని స్కూలు’ అని బోర్డులు తగిలించాలి. స్కూలు కాంపౌండ్‌కు 100 గజాల పరిధిలో బీడీలు, సిగరెట్లు, గుట్కా దుకాణాలు కనిపించకూడదు. 
► పొగతో కలిగే హాని ఎలాంటిదో తెలిపే స్టిక్కర్లు స్కూలు గోడలపై కనిపించాలి. స్కూలు ఆవరణలో ఎవరైనా పొగ తాగితే వారిపై చర్యలు తీసుకునే అధికారి, హోదా, ఫోన్‌ నంబరు గోడపై రాసి ఉండాలి. 
► 6 మాసాలకోసారి టొబాకో నిర్మూలనపై విద్యార్థులతో టీచర్లు చర్చించాలి. ఎవరైనా పొగ తాగితే వారిపై తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకూ తెలియజేయాలి.

రోజుకు 3,500 మంది మృతి
► దేశంలో పొగాకు వాడకం కారణంగా రోజూ 3,500 మంది మృతి చెందుతున్నారు. దేశంలో 9.95 కోట్ల మంది ఏదో ఒక రూపేణా పొగాకు ఉపయోగిస్తున్నారు. 19.94 కోట్ల మంది పొగలేని పొగాకు వాడుతున్నారు.
► ఒక్కొక్కరు సగటున సిగరెట్‌కు నెలకు రూ.1,192, బీడీలపై రూ.284 వ్యయం చేస్తున్నారు. ఏటా 13 లక్షల మంది పొగాకు కారక క్యాన్సర్‌లతో మృతి చెందుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడించింది.  

మరిన్ని వార్తలు