ఊర్మిళ జీవితంలో ‘గుడ్‌ మార్నింగ్‌’ 

16 Feb, 2021 08:56 IST|Sakshi
ఊర్మిళకు నియామక పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

రెండు చేతులు కోల్పోయిన యువతికి కేతిరెడ్డి సాయం

టీటీసీ పూర్తి చేసిన దివ్యాంగురాలికి విద్యా వలంటీర్‌ ఉద్యోగం 

‘గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం’ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతోంది. ఇంకెందరి జీవితాల్లోనో మార్పు తీసుకొస్తోంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం అవుతుండగా.. జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా విద్యుదాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన ఓ యువతి పరిస్థితికి చలించిన కేతిరెడ్డి.. ఆమెను విద్యావలంటీర్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

ధర్మవరం టౌన్‌: ధర్మవరం పట్టణంలోని పార్థసారధినగర్‌లో నివసిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటరాముడు, నాగలక్ష్మిల మూడో సంతానం  ఊర్మిళ. 11 ఏళ్ల క్రితం ఉద్యోగ రీత్యా వెంకటరాముడు అనంతపురంలో ఉంటుండగా.. ఓ రోజు ఊర్మిళ ఇంటిపై నుంచి ఇనుపకడ్డీని కిందకు తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలకు ఇనుపకడ్డీ తాకడంతో విద్యుదాఘాతానికి గురై రెండుచేతులు కోల్పోయింది. అయినా కుంగిపోని ఊర్మిళ చదువుపై దృష్టి సారించింది. రెండు చేతులు లేకున్నా చేతికి రబ్బరు బ్యాండులు వేసుకుని వాటి మధ్యలో పెన్ను పెట్టుకుని రాస్తూ చదువు కొనసాగింది.

ఉర్మిళ పరిస్థితి తెలుసుకున్న ధర్మవరం లయోలా పాఠశాల కరస్పాండెంట్‌ శంకర్‌నాయుడు పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించారు. దీంతో పదో తరగతిలో 9.7 పాయింట్లు సాధించిన ఊరి్మళ... అనంతరం ఎస్‌వీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీలో 856 మార్కులు సాధించింది. ఆ తర్వాత డైట్‌సెట్‌లో ర్యాంకు సాధించి ధర్మవరంలోని శ్రీసాయికృప డీఎడ్‌ కళాశాలలో టీటీసీ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నం కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా ఎమ్మెల్యేను కలుసుకుని తన బాధ చెప్పుకోవాలని భావించింది.

కలిసొచ్చిన ‘గుడ్‌మార్నింగ్‌’ 
గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మూడు రోజుల క్రితం ఊర్మిళ ఉంటున్న పార్థసారథి కాలనీకి వెళ్లగా ఆమె పరుగున వెళ్లి ఎమ్మెల్యేను కలిసింది. తనకు రెండు చేతులు లేవని తన తండ్రి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పింఛను కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తాను టీటీసీ పూర్తి చేశానని ఉద్యోగం ఇప్పిస్తే తన కాళ్లపై తాను నిలబడతానని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కడే ఉన్న కమిషనర్‌ మల్లికార్జునకు చెప్పి విద్యా వలంటీర్‌గా ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఈ విషయంపై ఒకటి రెండు సార్లు అధికారులతో మాట్లాడారు.

సోమవారం ధర్మవరం క్రీడా మైదానంలో దివ్యాంగురాలైన ఊర్మిళకు పట్టణంలోని నెహ్రునగర్‌ మున్సిపల్‌ పాఠశాలలో విద్యా వలంటీర్‌గా ఉద్యోగం ఇస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఎంత మందిని కలిసి తన సమస్య చెప్పుకున్నా.. ఎవరూ ఆదుకోలేదని, తన సమస్యను విని వెంటనే స్పందించి విద్యా వలంటీర్‌ ఉద్యోగం ఇప్పించినందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని ఊర్మిళ భావోద్వేగంతో చెప్పారు.

చదవండి: టీడీపీ కార్యకర్తల అరాచకం
పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు 
   

మరిన్ని వార్తలు