‘దిశ’తో మహిళలకు రక్షణ

30 Aug, 2021 04:38 IST|Sakshi

సీఎం జగన్‌ చర్యలు ప్రశంసనీయమని విద్యావేత్తలు, న్యాయ నిపుణుల అభినందన 

ఈవ్‌ టీజింగ్, వరకట్న వేధింపులు, ఫేక్‌ కాల్స్, అఘాయిత్యాలకు దిశ యాప్‌తో చెక్‌  

సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ‘దిశ’పై లైంగిక దాడి లాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకోరాదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన దిశ బిల్లు, దిశ యాప్‌ మంచి ఫలితాలనిస్తున్నాయని పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ‘యువతపై సోషల్‌ మీడియా ప్రభావం – మహిళా రక్షణకు ఏపీ దిశ యాప్‌ (చట్టం)’ అనే అంశంపై స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లి నుంచి మేధావులతో వర్చువల్‌ సమావేశం జరిగింది.

కార్యక్రమానికి విశ్లేషకుడిగా వ్యవహరించిన చుండూరు సుందర రామశర్మ మాట్లాడుతూ 2019 నవంబర్‌ 27న హైదరాబాద్‌లో జరిగిన దిశ  ఘటన అందరినీ కలచి వేసిందన్నారు. సీఎం జగన్‌ తక్షణమే స్పందించి  2019 డిసెంబర్‌ 3న ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకు దిశ బిల్లును తెచ్చారని తెలిపారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చేందుకు ప్రస్తుతం  కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఈవ్‌ టీజింగ్, వరకట్న వేధింపులు, ఫేక్‌ కాల్స్, చిన్నారులపై వేధింపులు తదితర ఘటనలపై ఉక్కుపాదం మోపేలా దిశ యాప్‌ దోహదం చేస్తోందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో 165 బాల్య వివాహాలను దిశ యాప్‌ ద్వారా నివారించారని, పోక్సో పరిధిలో నేరాల్ని అరికట్టేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు.  

‘దిశ’తో గట్టి చర్యలు 
చాలా మంది మహిళలు, విద్యార్థినులు సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై వేధింపులు, మోసాలకు గురవుతున్నారని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ డి.జమున పేర్కొన్నారు. ఇలాంటి వాటికి దిశ చెక్‌పెట్టి రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తే సమస్యలు తప్పవని తిరుపతి అడిషనల్‌ ఎస్పీ సుప్రజ తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా జరుగుతున్న నేరాలపై అందరిలోను చైతన్యం తేవాలని పద్మావతి విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌ డి.సీతాకుమారి సూచించారు.

1988లో పంజాబ్‌లో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి పట్ల సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో న్యాయం కోసం 17 ఏళ్లు పోరాడాల్సి వచ్చిందని తమిళనాడు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది అపర్ణ చెప్పారు. 2013లో నిర్భయ చట్టం, 2019లో దిశ బిల్లు మహిళలకు సత్వర న్యాయం జరిగేలా దోహదం చేస్తున్నాయన్నారు. మహిళల రక్షణకు దిశ బిల్లు, దిశ యాప్‌ ద్వారా సీఎం జగన్‌ గట్టి చర్యలు చేపట్టారని అభినందించారు. ప్రజలంతా నిద్రించే సమయం మినహా సెల్‌ఫోన్, సోషల్‌ మీడియాకు అలవాటుపడినట్లు సీనియర్‌ జర్నలిస్ట్‌ బండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజం అంతా కలసికట్టుగా కృషి చేయాలని కోరారు.   

మరిన్ని వార్తలు