ఎందుకీ కడుపుమంట? తాగుబోతు రాతలేల?

7 Sep, 2021 05:11 IST|Sakshi

ఏది నిజం?
గతంలో కనిష్టంగా 180 మిల్లీలీటర్ల మద్యం బాటిళ్లు మాత్రమే దొరికేవి. ఇప్పుడు దాన్ని సగానికి.. అంటే 90 మిల్లీలీటర్లకు తగ్గించి, రేటు కూడా తగ్గించి అమ్ముతున్నారు. కానీ ఇలా చెయ్యటం ‘ఈనాడు’కు అస్సలు నచ్చటం లేదు. బీరు బాటిళ్లూ అంతే! ఇప్పుడు విక్రయిస్తున్న 650 ఎంఎల్‌ సైజు సగానికి తగ్గించి..330  ఎంఎల్‌ టిన్‌లను విక్రయిస్తున్నారు. ఇది కూడా ‘ఈనాడు’కు నచ్చటం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది.. ఎక్కువ బాటిళ్లు కొనుక్కుని తాగేస్తారట? నిజానికి రామోజీరావుకో, ‘ఈనాడు’కో నచ్చనిది మద్యం బాటిల్‌ సైజు తగ్గించటమో, దాని ధర తగ్గించటమో కాదు!!. తన సహచరుడు, తన సామాజిక వర్గానికి చెందిన బాబు... ఏపీ ముఖ్యమంత్రి కాకపోవటమే!. పైపెచ్చు మద్య నియంత్రణ చేపడతానన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ వెళుతుండటమే. ఓ వైపు మద్యం వినియోగం గణనీయంగా తగ్గుతున్నా.. దానిపై ప్రభుత్వానికొచ్చే ఆదాయం తగ్గకపోవటమే!. 

ఆదాయం తగ్గి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతే... అప్పుడైనా తన చంద్రబాబుకు కాలం కలిసొస్తుందన్న ఆశ రామోజీది!. అది నెరవేరటం లేదన్న ఫ్రస్ట్రేషన్‌ ఫలితమే పతాక శీర్షికన ‘మద్య నిషాధ’ రాతలు. మరి ఈ నిషా రాతల్లో వాస్తవమెంత? ఏది నిజం?

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని దశలవారీ పూర్తిగా నియంత్రించాలన్నది ముఖ్యమంత్రి సంకల్పం. దానికి తగ్గట్టే అధికారం చేపట్టాక చర్యలు మొదలెట్టారు. 43 వేల బెల్ట్‌ షాపులపై వేటు వేశారు. 4,408  పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. దుకాణాల సంఖ్యను ఈ రెండేళ్లలో మూడోవంతు తగ్గించారు. అవి తెరిచి ఉంచే వేళలనూ కుదించారు. కల్తీలకు చోటు లేకుండా దుకాణాల్ని నేరుగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ఫలితం.. మద్యం అమ్మకాలు ఏకంగా 40 శాతం తగ్గాయి. బాబు పాలనలో 2018 అక్టోబర్‌ నుంచి ఏడాది కాలంలో 3.12 కోట్ల కేసుల లిక్కర్‌ విక్రయిస్తే.. ఆ తరువాతి 12 నెలల్లో విక్రయించింది కేవలం 1.88 కోట్ల కేసులు. ఆ తరువాతి ఏడాది... అంటే 2020–21 అక్టోబర్‌ మధ్య ఈ సంఖ్య 1.72 కోట్ల కేసులకు తగ్గింది. మరి ఇంతలా తగ్గుతుంటే రామోజీకి కడుపుమంట ఎందుకట? మద్యం విక్రయాలు పెంచేస్తున్నారంటూ గగ్గోలు ఏల? ఎందుకంటే అధికారంలో ఉన్నది వైఎస్‌ జగన్‌ కాబట్టి!!. 

సైజు తగ్గించటం జనం మంచికి కాదా? 
180 ఎంఎల్‌ మద్యం సీసాలు మాత్రమే దొరికితే... పేదలు, మద్యం ప్రియులు స్థోమత లేకున్నా వాటినే కొనేవారు. కొన్నందుకు తాగేవారు. బీరు కూడా 650 ఎంఎల్‌ సీసాలే విక్రయిస్తున్నారు. తాగేవారు స్థోమత లేకున్నా వీటినే కొని తాగాల్సి వస్తోంది. తక్కువ తాగితే ఆరోగ్యం, జేబు బాగుంటాయన్న ఉద్దేశంతోనే 90 ఎంఎల్‌ సీసాలు, 330 ఎంఎల్‌ బీర్‌ టిన్‌లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. అందరికీ ఈ నిర్ణయం మంచిదే అనిపిస్తున్నా... ‘ఈనాడు’కు మాత్రం నచ్చటం లేదు. అందరూ 180 ఎంఎల్‌ లిక్కర్, 650 ఎంఎల్‌ బీరు తాగాల్సిందేనని ‘ఈనాడు’ చేస్తున్న వాదన లోగుట్టు అందరికీ తెలిసిందే. కుర్చీలో  ఉన్నది తమవాడు కాకుంటే పాజిటివ్‌లు కూడా నెగిటివ్‌ అయిపోతాయన్నది అర్థమవుతున్న కథే. 

వాకిన్‌ షాపులు... ఫిలిం సిటీలోనే ఉండాలా?
మద్యంతో నిరుపేదల ఇళ్లు, ఒళ్లు గుల్ల కాకూడదన్న ముఖ్యమంత్రి ఆలోచనకు ప్రతిరూపమే ‘వాకిన్‌ స్టోర్స్‌’. నిజానికి రామోజీ హోటళ్లలో ఉండే బార్లు ఒక రకంగా వాకిన్‌ స్టోర్లే. అక్కడకు వెళ్లిన వారు నచ్చిన మద్యాన్ని కొనుక్కోవచ్చు!. రాష్ట్రంలోని మాల్స్‌లో ఇలా వాకిన్‌ స్టోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయటం మాత్రం రామోజీకి నచ్చటం లేదు. ఇది కూడా మద్యం విక్రయాలను పెంచటానికేనన్నది ‘ఈనాడు’ భాష్యం. ఫుల్‌ బాటిళ్లనే విక్రయించే ఈ స్టోర్లకు ఎగువ మధ్యతరగతి, ఉన్నతవర్గాల వారే వెళతారని, పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల వారు వాటి జోలికెళ్లేందుకు సాహసించరని రామోజీకి తెలియదా? దీనివల్ల ఆయా వర్గాల్లో మద్యపానం తగ్గుతుందనేది వేరే చెప్పాలా? బాబు మాదిరి విచ్చలవిడిగా బెల్టు దుకాణాల్ని పెంచటమే మంచిదా? మద్యం విక్రయాలు తగ్గాయని చెబుతున్న అధికారిక లెక్కలు వీళ్లకు కనిపించవా? వాస్తవాలు అక్కర్లేదా? 

ఎందుకీ సా‘రాతలు’?
సారా విక్రయాలు పెరిగితే మాత్రం నష్టమేంటన్న రీతిలో రాసిన ‘ఈనాడు’ రాతలు దాని దిగజారుడుకు పరాకాష్టే. వారిని సారాకు దూరం చేయటానికే 90 ఎంఎల్‌ సీసాలు తెస్తున్నారనే వాదనా బాధ్యతారాహిత్యమే. ఒకప్పుడు సారాకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర రామోజీది. కాకపోతే అదంతా తన వ్యాపార ప్రయోజనాల కోసమేనన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఇప్పుడాయన సారాను ప్రోత్సహించినా ఆశ్చర్యపోవటం లేదెవ్వరూ!. 1994కు ముందు ఎన్టీఆర్‌తో కలిసి మద్య నిషేధం ఎందుకు అవసరమో రెచ్చిపోయి మరీ అచ్చేసిన ఘనత ‘ఈనాడు’ది. 1995లో బాబుతో కలిసి మద్యం ఎందుకు అవసరమో రాసి మరీ చెప్పింది కూడా రామోజీయే. ఈ రామోజీ మార్కు రాజకీయంలో మోసపోయింది రాష్ట్రమే. కాకుంటే ముఖ్యమంత్రి జగన్‌ తీరు అది కాదు. చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్లటమే ఆయన నైజం. ఇదే నిజం!!. 

కొన్ని వాస్తవాలివిగో... 
► 2019 మే నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండేవి. ఈ రెండేళ్లలో వీటి సంఖ్య 33% అంటే 1,433 దుకాణాలు తగ్గాయి. ప్రస్తుతం 2,975 దుకాణాలే ఉన్నాయి. 
► టీడీపీ హయాంలో రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలకు అనుబంధంగా 4,408 పర్మిట్‌ రూమ్‌లు ఉండేవి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ రద్దు చేసింది.
►గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేవారు. దాన్ని మార్చి ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకే తెరుస్తున్నారిప్పుడు. 
► టీడీపీ అధికారంలో ఉన్న 2019 మేతో పోలిస్తే 2021, ఆగస్టు నాటికి రాష్ట్రంలో లిక్కర్‌ అమ్మకాలు 40 శాతం తగ్గగా... బీర్‌ అమ్మకాలు ఏకంగా 78 శాతం తగ్గాయి.  అప్పట్లో ఏడాదికి 3.12 కోట్ల లిక్కర్‌ కేసులు విక్రయించగా... ఇప్పుడది 1.72 కోట్ల కేసులకు తగ్గింది.  
► బాబు హయాంలో ఏటా 2.44 కోట్ల బీరు కేసుల్ని విక్రయించగా... ఇప్పుడా సంఖ్య 52 లక్షల కేసులకు చేరింది. ఏకంగా 78శాతం తగ్గాయి మరి.   

మరిన్ని వార్తలు